భారతదేశం మూలికా చికిత్సలకు మరియు ప్రత్యామ్నాయ వైద్యపద్ధతులకు నిలయం. ఈ వైద్య పద్ధతులు భారతదేశ జనపదాల్లో సహజంగానే వెల్లివిరుస్తున్నాయి. ఈ సంగతి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వ్యాసంలో “నేలతాడి” అనే అరుదైన మూలిక గురించి సవివరంగా తెలియజేస్తున్నాం. నేలతాడి లేక “నేలతాటి” మొక్క లేక మూలిక అని పిలువబడే ఈ నేలబారు మొక్క (అంటే నేలపైనే అల్లుకుని విస్తరించి ఉండే మొక్క) అటవీ ప్రాంతాల్లో కనబడే ఓ సహజసిద్ధమైన మూలిక. దీని వేర్లను ‘నేలతాడి గడ్డలు” అని కూడా వ్యవహరించడం వాడుకలో ఉంది. దీనినే భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో “సఫేద్ ముస్లి” లేక “వైట్ ముస్లి” (white musli) అని కూడా పిలుస్తారు.
నేలతాడి అనేది భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఓ అరుదైన మూలిక. భారతదేశపు అడవుల్లో సహజంగా పెరిగే ఈ నేలబారు మొక్క సాధారణంగా ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందుకే దీన్ని “ఇండియన్ స్పైడర్ ప్లాంట్” (Indian Spider Plant) అని కూడా పిలుస్తారు. మరో దివ్యమైన సంగతేంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఏర్పడ్డ పురోగతి సాయంతో, పరిశోధకులు నేలతాడిలో దాగున్న మరెన్నో ఆయుర్వేద ప్రయోజనాలను అన్వేషించగలిగారు.
అంతర్జాతీయ మార్కెట్లో నేలతాడికి గిరాకీ పెరుగుతోంది. ఇందుకు ఈ మూలికలో ఉండే ఔషధగుణాలే కారణం. ముఖ్యముగా నేలతాడి సేవనం పురుషుల లైంగిక సమస్యలను నివారించి వారిని ఉత్తేజితపూరితుల్ని చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డ ప్రకారం, నేలతాడి మగవారి లైంగిక ఆరోగ్యానికి శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందులోనూ, ఇది ఓ అద్భుతమైన “ఒత్తిడి-వ్యతిరేక-మూలిక” (ఆంగ్లంలో అడాప్టోజన్) గా ప్రసిద్ధి చెందింది. అంటే ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి సమస్యలకు మంచి విరుగుడుగా పని చేస్తుందిది. అందుకే దీన్ని ఆయుర్వేద వైద్యులు "వైట్ గోల్డ్" లేదా “దివ్య ఔషధం” అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మరో సంగతేంటంటే నేలతాడికి “వయాగ్రా” లాగా మగవారి లైంగిక సామర్త్యాన్ని మెరుగుపర్చగల సామర్థ్యం పుష్కలంగా ఉంది. అదనంగా మరో విషయం ఏమిటంటే లైంగిక సామర్థ్యం పెరుగుదలకు లభించే వాణిజ్యపర-రసాయానిక మందులు (వయాగ్రా లాంటివి) కల్గించే దుష్ప్రభావాలను నేలతాడి అనే ఈ మూలికామందు కల్గించదు.
కాబట్టి, వయాగ్రా లాంటి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే వాణిజ్యపర మందులకు ప్రత్యామ్నాయంగా నేలతాడికి ఒక్క భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా జనాదరణ లభిస్తోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే నేలతాడి మూలిక వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు (side effects) కలుగవు. చారిత్రకపరంగా చూస్తే, నేలతాడి గురించిన ప్రస్తావన అనేక సంవత్సరాల క్రితమే కన్పిస్తుంది. ఈ మూలిక గురించిన మొట్టమొదటి ప్రస్తావన "రాజ్ నిఘంటు” అని అని పిలువబడే ఓ పాత భారతీయ పుస్తకంలో లభించింది. రాజ్ నిఘంటు అనేది ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన రచన. రాజ్ నిఘంటులో ప్రత్యేకమైన మూలికలు, వాటి లక్షణాలు మరియు చికిత్సా వివరాలూ ఉన్నాయి.
భారతదేశంలో నేలతాడి ఒక సాధారణ అటవీ మొక్క అయినప్పటికీ, పెరుగుతున్న అహేతుకమైన అటవీ నాశనం మరియు అటవీ దుంపల సేకరణ భోమిపై నేలతాడి ఉనికికే ప్రమాదమేర్పడే పరిస్థితి దాపురించింది. “ప్రకృతి పరిరక్షణ కోసం ఇంటర్నేషనల్ యూనియన్”-IUCN అనబడే సంస్థ నేలతాడిని “వేగంగా అంతరించి పోతున్న మూలికల జాబితా”లో చేర్చింది. అంటే నేలతాడి మూలికను ప్రజలు, ప్రభుత్వం సంరక్షించుకోకపోతే అది త్వరలోనే అంతరించిపోతుంది అని IUCN హెచ్చరిస్తోంది. ఈ సంగతులన్నీ ఎట్లా ఉన్నా, నేలతాడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ మరియు కొత్త శాస్త్రీయ పురోగతులు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వ్యవసాయ భూముల్లో దీన్ని “నగదు పంట” (cash crop)గా పండిస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ విషయమే గదా!
నేలతాడి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఓషధిశాస్త్ర నామం: క్లోరోఫైటం బోరివిలియనం లేదా ఆస్పరాగస్ యాడ్సెన్ డెన్స్
- కుటుంబం: లిలియాసియా
- సాధారణ పేర్లు: సఫేద్ ముస్లీ లేదా వైట్ ముస్లీ, ఇండియన్ స్పైడర్ ప్లాంట్
- సంస్కృత నామం: ముసాలి
- ఉపయోగించే భాగాలు: నేలతాడి వేర్లు మరియు విత్తనాలు
- మూలిక స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: నేలతాడి భారతదేశానికి మాత్రమే పరిమితమైన మూలిక, అంటే ఇది భారతదేశంలో మాత్రమే ఉన్నట్లు గుర్తించబడుతోంది. (ప్రపంచంలో మరెక్కడా లభిస్తున్నట్టు లేదు.) భారత్ లోని గుజరాత్, మహారాష్ట్ర, మరియు రాజస్థాన్ రాష్ట్రాలు నేలతాడిని ప్రధానంగా పండిస్తున్న రాష్ట్రాలు.
- శక్తిశాస్త్రం: రెండు దోషాలైనటువంటి వాత, పిత్తాల్ని శాంతపరుస్తుంది కానీ కఫ దోషాన్ని పెంచుతుంది.