శిలాజిత్తు అంటే ఏమిటి?
శిలాజిత్తు సహజంగా లభించే ఖనిజ పదార్ధం. ఇది భారత ఉపఖండంలోని హిమాలయ మరియు హిందూకుష్ శ్రేణులలో లభిస్తుందని కనుగొనబడింది. ఇది లక్క లాంటి అరుదైన “రెసిన్” (గుగ్గిలం). మొక్కలు మరియు మొక్క-సంబంధ పదార్థాలు వేలాది సంవత్సరాల పాటు కుళ్ళిపోయి, అటుపై అలా ఆ కుళ్ళిన పదార్ధం బండరాళ్ళపైన, రాళ్ళ మధ్యలోను చిక్కుకు పోయి కాలక్రమాన నల్లటి లేక గోధుమ రంగు బంక-వంటి పదార్ధంలాగా తయారై శిలాజుత్తుగా మారుతుంది. భారతీయ సంప్రదాయిక వైద్య విధానం వేల సంవత్సరాల నుండి శిలాజిత్తు ను ఉపయోగిస్తోంది. ఇందుకు శిలాజిత్తులో ఉన్న ఆరోగ్య రక్షక లక్షణాలే కారణం. శిలాజిత్తు గురించిన ప్రస్తావనలు చరక సంహిత మరియు శుశ్రుత సంహిత లో కూడా కనిపిస్తాయి. ఈ రెండింటిలోనూ శిలాజిత్తు ను "బంగారం వంటి లోహపు రాళ్ళు" గాను, మరియు సాంద్రత కల్గిన బంకపదార్థం (gelatinous substance) గానూ పేర్కొనబడింది. ఆయుర్వేద శాస్త్రం శిలాజిత్తును మొత్తం శరీర ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే ఓ “టానిక్” లేదా “రసాయనం” అని పేర్కొనింది. శిలాజిత్తు యొక్క విస్తృత ప్రయోజనాలను ఆయుర్వేదం వివరించింది. వాస్తవానికి, “శిలాజిత్తు” పేరుకు అర్థం "పర్వతాల విజేత” అని, మరియు “బలహీనతను నాశనం చేస్తుంది" అనే అర్ధం వస్తుంది. దురదృష్టవశాత్తు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం సహజసిద్ధమైన “శిలాజిత్తు” అనబడే ఈ అద్భుత (మందు) వస్తువు గురించి ఇంకా పరిశోధనాది అన్వేషణలు జరపాల్సి ఉంది.
శిలాజిత్తు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- లాటిన్ పేరు: ఆస్ఫాల్టం పుంజాబియనం (Asphaltum punjabianum)
- సాధారణ పేరు: తారు, ఖనిజ పిచ్, మినరల్ మైనం, షిలాజిట్
- సంస్కృతం పేరు: శిలాజిత్, శిలాజిత
- భౌగోళిక పంపిణీ: శిలాజిత్తు సాధారణంగా హిమాలయాల్లో కనిపిస్తుంది. భారత్ లోని హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్లు రాష్రాల్లో శిలాజిత్తు సాధారణంగా లభిస్తుంది. ఇది చైనా, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో కూడా దొరుకుతుంది.
మీకు తెలుసా?
ఆయుర్వేద వైద్యులు చెప్పిన ప్రకారం, శిలాజిత్తు యొక్క వాసన ఆవు మూత్రంలా (పంచితం) ఉంటుంది. జానపద కథల ప్రకారం కల్తీ లేని ముడి శిలాజిత్తును స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సేవిస్తే అది వారిరువురికీ కూడా చాలా మిక్కుటంగా ఉపయోగపడుతుందట.