విటమిన్ ఇ అంటే ఏమిటి?
విటమిన్ E కొవ్వును కరిగించే విటమిన్ మరియు శక్తివంతమైన అనామ్లజని. అనామ్లజని గనుక ఇది మీ చర్మాన్ని హాని నుండి రక్షిస్తుంది. ఇది అనేక ఆహార ఉత్పత్తులలో సహజంగా లభిస్తుంది. మన శరీరం విటమిన్ ‘ఇ’ ని అవసరం వచ్చేవరకూ నిల్వ చేసుకుని ఉంటుంది. విటమిన్ ‘ఇ’ ఎనిమిది వేర్వేరు సమ్మేళనాలను కలిగి ఉంటుంది, వీటిలో అత్యంత చురుకైన సమ్మేళనం ఆల్ఫా-టోకోఫెరోల్. మనిషి చర్మం యొక్క సాధారణ స్థితిస్థాపకతను విటమిన్ ‘ఇ’ నిర్వహిస్తూనే అరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది. స్వేచ్ఛా రాసుల కారణంగా సంభవించే అకాల వృద్ధాప్యం లేదా చర్మం ముడుతలను కూడా ఇది నివారిస్తుంది. చర్మం మరియు జుట్టు కోసం విటమిన్ E ప్రయోజనాలు బోల్డన్ని ఉన్నాయి. వాటిని గురించి ఇదే వ్యాసంలో వేర్వేరు విభాగాలలో చర్చించడం జరిగింది. కానీ మొదట, చర్మం యొక్క అరుగుదల-తరుగుదలలకు కారణమేంటో చర్చిద్దాం.
స్వేచ్ఛా రాశులు అంటే ఏమిటి?
స్వేఛ్చారాశి (ఫ్రీ రాడికల్) జతలేని ఏక కణం. ఈ ఏక కణాలు జంటను రూపొందించుకోవడానికి అత్యంత చురుకుగా (తహతహ పడుతూ) ఉంటాయి. ఈ ఏక కణాలు తమ ప్రతిచర్యలతో (మీ) చర్మం మరియు శరీరంలోని కణాలతో కలబడుతూ, ఎపుడూ వాటిని (చర్మం, కణాలను) దెబ్బతియ్యడానికి సంభావ్యతను కలిగిఉంటాయి. ఈ ఏక కణాల ప్రతిచర్య మీ కణాలకు కలిగే నష్టానికి కారణమవుతున్న ఆక్సీకరణ ఒత్తిడిని ప్రారంభిస్తుంది. స్వేచ్ఛారాశులు ప్రధానంగా చర్మాన్ని దెబ్బతీసేటప్పుడు, అవి కేంద్ర నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మొదలైన ఇతర శరీర కణజాలాలను మరియు అవయవ వ్యవస్థలను కూడా బాధించవచ్చు. నియంత్రణ లేని ఈ ఏక కణాల చర్య ఈ కింది రుగ్మతలను కలిగిస్తుంది:
- అల్జీమర్స్ వ్యాధి లేదా చిత్తవైకల్యం వంటి కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు.
- అకాల (అంటే వయసుకు మించి) ముడుతలతో, చర్మం స్థితిస్థాపకత లేదా సున్నితత్వాన్ని కోల్పోవడం, చర్మం ఆకృతిలో మార్పు వంటివి.
- జుట్టు సమస్యలైన వెంట్రుకలు రాలిపోవడం, మరియు వయసు మీరకనే జుట్టు (నెరవడం) తెల్లబడిపోవడం తదితర సమస్యలు.
- కీళ్ళవాతం (రుమటోయిడ్ ఆర్థరైటిస్) వంటి స్వయంచాలిత రోగనిరోధక రుగ్మతలు (ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్).
- కొన్ని రకాల క్యాన్సర్లు.
- శరీర కణాల క్షీణతకు సంబంధించిన రుగ్మతలు ( డిజెనరేటివ్ డిజార్డర్స్).
- ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డంకులేర్పడి వచ్చే రక్తనాళాలు గట్టిపడటం లేదా ఎథెరోస్క్లెరోసిస్ రుగ్మత .
- దృష్టి క్షీణత, అస్పష్ట దృష్టి లేదా కంటిశుక్లం వంటి కంటి లోపాలు.
- చక్కెరవ్యాధి (డయాబెటిస్).
శరీరంలో స్వేచ్ఛా రాశులు ఏర్పడడానికి ఏమి కారణమవుతుంది?
స్వేఛ్చారాశులు (ఫ్రీ రాడికల్స్) సహజంగా ఏర్పడతాయి. అయితే ధూమపానం, అధిక మద్యపానం లేదా చాలా ప్రమాణంలో మసాలాలతో కూడిన వేపుడు ఆహార పదార్థాల (జంక్ ఫుడ్) సేవనం వంటి కొన్ని జీవనశైలీ ఆహారపుటలవాట్ల కారకాలు; పర్యావరణ కాలుష్యాలు, రసాయనాలు, పురుగుమందులు లేదా శరీర యంత్రాంగాలను మార్చగల ఇతర ఏజెంట్ల వంటివి శరీరంలో స్వేచ్ఛా రాషుల్ని వేగవంతంగా ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి.
స్వేఛ్చారాశులతో పోరాడటానికి విటమిన్ E ఎలా సహాయపడుతుంది?
పైన చెప్పినట్లుగా, విటమిన్ E అనామ్లజనకాల్ని అధికంగా కల్గి ఉంటుంది గనుక స్వేచ్ఛా రాశుల యొక్క ప్రతిచర్యను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంతుంది. అనామ్లజనకాలు (యాంటీఆక్సిడెంట్లు) ఇతర అణువుల ఆక్సీకరణను నివారించడంలో సహాయపడతాయి. స్వేచ్ఛా రాశులుగా ఒక అదనపు ఎలక్ట్రాన్ ఏర్పాటు ద్వారా ఇది ప్రారంభించబడుతుంది, తద్వారా వాటి కార్యకలాపాలు మరియు రసాయన అస్థిరతను తగ్గిస్తుంది.