నిమ్మకాయ, రూటేసి కుటుంబానికి చెందిన మంచి పండు. నిమ్మకాయ యొక్క పుల్లని మరియు తాజా రుచి గురించి తెలియయని ఇల్లు ఉండదు. నిజానికి, నిమ్మ యొక్క రుచి, నాలుకపై రుచి మొగ్గల మీద నుంచి త్వరగా విడిచిపోదు. నిమ్మకాయను వంటల్లో ప్రత్యేకమైన రుచి మరియు వాసనకు మాత్రమే కాకుండా, ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ నీరును సాంప్రదాయకంగా దాని బరువు తగ్గుదల మరియు విషపదార్దాల నిర్ములన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది సిట్రస్ కుటుంబంలోనే విటమిన్ సి యొక్క ఉత్తమ వనరుల్లో ఒకటి, విటమిన్ సి అనేది నిమ్మకాయకు వృద్ధాప్య వ్యతిరేక మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగిస్తుంది.
నిమ్మకాయ అనేది ఒక సతతహరిత (evergreen) వృక్షం, ఇది 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. నిమ్మకాయ చెట్టు కొమ్మలు మీద ముళ్ళు ఉంటాయి. కొత్తగా వచ్చే నిమ్మ ఆకులు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి మరియు అవి నిమ్మకాయ చెట్టు కొమ్మల మీద వికల్పంగా (ఒకటి విడిచి ఒకటిగా) పెరుగుతాయి.ముదిరిన తర్వాత, ఈ ఆకులు ఒకవైపు ముదురు ఆకుపచ్చ రంగును మరియు మరో వైపు లేత ఆకుపచ్చని రంగులోకి మారుతాయి. నిమ్మకాయ పువ్వులు ఘాడమైన సువాసనతో తెల్లగా ఉంటాయి, అవి ఒకొక్కటిగా లేదా గుత్తులుగా నిమ్మకాయ చెట్ల కొమ్మలపై పూస్తాయి. నిమ్మకాయ పండు ఆకుపచ్చ రంగులో కాస్తుంది మరియు పక్వానికి చేరినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది.
మీకు తెలుసా?
నిమ్మకాయ, మనకి నేడు తెలిసినట్లుగా కాక, మాడరిన్ మరియు సిట్రాన్ వంటి అడవి సిట్రస్ జాతుల నుండి రూపొందిన ఒక మిశ్రజాతి (హైబ్రిడ్). క్రిస్టోఫర్ కొలంబస్ 1493 లో తన ప్రయాణంలో నిమ్మ గింజలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ప్రవేశపెట్టాడు.
నిమ్మ గురించి కొన్ని ప్రాథమిక నిజాలు
- శాస్త్రీయ నామం: సిట్రస్ లిమోన్ (Citrus limon)
- కుటుంబం: రూటేసి (Rutaceae)
- సాధారణ నామాలు: నిమ్మ, నింబూ
- సంస్కృత నామం: నింబుక
- ఉపయోగించే భాగాలు: పండు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: నిమ్మకాయ చెట్టును భారతదేశం యొక్క స్థానిక చెట్టుగా భావిస్తారు, కానీ ఇది మెక్సికో, మొరాకో, జపాన్, గ్రీస్, అల్జీరియా, ఆఫ్రికా, ఈజిప్టు మొదలైన దేశాలలో కూడా విస్తృతంగా సాగు చేస్తారు.
- శక్తి శాస్త్రం: చల్లదనం