మీరు ఆహారప్రియులైతే, వంటగదులలో కేవలం పండ్లు, కూరగాయలు మరియు మసాలా దినుసులు మాత్రమే ఉండవని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, వాస్తవానికి వంట గదులలో ప్రపంచం నలుమూలల నుండి లభించే వివిధ ఆహార పదార్దాలు ఉంటాయి.
సగ్గుబియ్యం అనేది చాలా భారతీయ ఇళ్లలో వినిపించే ఒక సాధారణ పేరు, అయితే ఇది చెట్లకు పెరగదని మీకు తెలుసా? అలాగే ఇది మొక్క యొక్క విత్తనం లేదా పండు కాదు. ఇది కర్రపెండలం దుంపల నుండి వచ్చే ఒక రకమైన పిండి పదార్ధం మరియు దీనిలో కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉండవు. అవి మాత్రమే కాదు, దీనిలో గ్లూటెన్ కూడా ఉండదు మరియు గ్లూటెన్ అసహనం ఉన్నవారికి సురక్షితమైనది. ఈ రోజుల్లో సగ్గుబియ్యం ఇంత ప్రముఖంగా మారడానికి ఇది కూడా ఒక కారణం.
ఇది ఫైబర్ మరియు కేలరీలతో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మీరు దానిని ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారో అనే దాన్ని బట్టి, బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మరియు మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది మరియు ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి, అవి వివిధ శరీరం జీవ ప్రక్రియలకు సహాయపడతాయి.
కర్రపెండలం మొక్క ఉష్ణమండల వాతావరణంలో పెరిగే ఒక శాశ్వత మొక్క. ఇది పాక్షికంగా కలప కాండం కలిగి ఉంటుంది మరియు ముదురు ఆకుపచ్చ ఆకులు ఉంటాయి అవి ఒకదానికొకటి ఎదురెదురుగా పెరుగుతాయి. ఆకు కాడ మరియు కొమ్మ రెండూ ప్రత్యేకమైన ఎరుపు నీడను (రంగును) కలిగి ఉంటాయి, ఇది కర్రపెండలం మొక్కను గుర్తించే లక్షణాలలో ఒకటిగా ఉంటుంది. కర్రపెండలం మొక్క 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దాని దుంపలు కాండం యొక్క అడుగున నుండి పెరుగుతాయి. ఈ దుంపలు కర్రపెండలం మొక్క యొక్క తినదగిన భాగాలు, వీటి నుండి స్టార్చ్ (పిండి) తీయబడుతుంది.
మీకు తెలుసా?
కర్రపెండలం కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ప్రధానమైన ఆహారాలలో ఒకటి.
ఈ వ్యాసం, కర్రపెండలం ఎలా ఉపయోగించబడుతుందో మరియు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయబడుతుంది.
అయితే మొదట, కర్రపెండలం మొక్క యొక్క కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకుందాము
- శాస్త్రీయ నామం: మనిహోట్ ఎస్కులెంటా (Manihot esculenta)
- కుటుంబం: యుఫోర్బియాసి (Euphorbiaceae)
- సాధారణ నామం: కాసావా, యుకా, కర్రపెండలం, బ్రెజిల్ ఆరోరూట్
- సంస్కృత నామం: తరుకాండ
- ఉపయోగించే భాగాలు: వేర్లు (దుంపలు)
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: వాస్తవానికి, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది, బ్రెజిల్, వెస్టిండీస్ మరియు ఆఫ్రికాలో విస్తృతంగా పెరుగుతుంది. భారతదేశంలో, కర్రపెండలం మొక్క ప్రధానంగా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో పండిస్తారు.