సారాంశం
నిర్జలీకరణం (డీహైడ్రేషన్) అంటే శరీరంలో ఉండాల్సిన నీటి శాతం యొక్క నష్టం లేక ఉండాల్సిన నీటి పరిమాణం తగ్గిపోవడం. మన శరీరంలో జరిగే ప్రతి ప్రతిచర్యకు నీరు అవసరం. అందువల్ల, తగినంతగా నీరు లేకపోవడం ఈ ప్రతిచర్యలను దెబ్బ తీస్తుంది, ఇవి రక్త పరిమాణం తగ్గడం, మూత్ర విసర్జన తగ్గడం, అలసట మరియు ఇతరులు వంటి ముఖ్యమైన అవాంతర పరిణామాలకు దారితీయవచ్చు. తగినంతగా నీరు తీసుకోకపోవడం, ఎక్కువసేపు వేడికి గురికావడం (లేక తీవ్రమైన ఎండలో తిరగడం), వాంతులు లేదా విరేచనాలు కలిగించే అంటు వ్యాధులు మరియు అధిక వ్యాయామం వల్ల అధిక చెమట కారణంగా నిర్జలీకరణం (డీహైడ్రేషన్) సంభవిస్తుంది. వ్యాకులత, నిద్రలేమి, చిరాకు, విపరీతమైన దాహం మరియు మూత్ర విసర్జన తగ్గుదల వంటి లక్షణ సంకేతాలను మరియు లక్షణాలను గమనించడం ద్వారా నిర్జలీకరణాన్ని సులభంగా గుర్తించవచ్చు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. సోడియం, పొటాషియం మరియు క్లోరిన్ లవణాలతో పాటు గ్లూకోజ్ కలిగిన ‘రీహైడ్రేషన్ ద్రావణం’ రూపంలో ఉండే ద్రవాహారాన్ని వ్యక్తికి తాగిస్తే శరీరంలో నీరు-ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. సత్వర చికిత్స సాధారణంగా నిర్జలీకరణాన్ని తిప్పికొడుతుంది, అయితే లక్షణాలను విస్మరిస్తే, ఇది తక్కువ రక్తపోటు, కాలేయం మరియు మూత్రపిండాల వైఫల్యం, అపస్మారక స్థితి మరియు తీవ్రమైన సందర్భాల్లో, ప్రాణాంతకమూ అవుతుంది.