ఈ రోజు ప్రపంచంలో అధిక సంఖ్యలో జనాభాను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలలో కంటి చూపు క్షీణించడం ఒకటి. భారతదేశంలో, దాదాపు 550 మిలియన్ల మంది ఏదో ఒక కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. చాలా ముఖ్యమైన ఇంద్రియ అవయవాలలో ఒకటైన కళ్ళు, స్పర్శించ వలసిన అవసరం లేకుండా ఇంద్రియాల (సెన్సెస్) ను అభివృద్ధి చేయడానికి మరియు అనుభూతి చెందడానికి మనకు సహాయపడతాయి. అందువల్ల, మనం వాటిని ఏ విధమైన హాని నుండి అయినా రక్షించుకోవడం చాలా ముఖ్యం.

వయస్సు, జన్యులు మరియు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి వివిధ అంశాలు కంటి చూపును ప్రభావితం చేస్తాయి, అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన రెటీనా మరియు కార్నియాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫోటోడ్యామేజ్‌ను నివారించడంలో అవి సహాయపడతాయి. కంటి లోపాలకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వ్యాసం కంటి చూపును మెరుగుపరిచేందుకు పాటించవలసిన అన్ని ఆహార చిట్కాలు మరియు వ్యాయామాలను గురించి చర్చిస్తుంది.

  1. కంటి చూపును మెరుగుపరచే ఆహారాలు - Foods to improve eyesight in Telugu
  2. కంటి చూపు మెరుగుపరచడానికి శిక్షణా వ్యాయామాలు - Training exercises to improve eyesight in Telugu
  3. కంటి చూపును మెరుగుపరుచుకోవడం ఎలా అనే దాని పై ఉపసంహారం - Takeaway on how to improve eyesight in Telugu

విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. కంటి చూపును కాపాడే కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు (రిపేర్) కు ఈ ఆహారాలు ఉపయోగపడతాయి. కంటి చూపు సహజంగా మెరుగుపడంలో సహాయపడే అటువంటి కొన్నిఆహారాల జాబితా ఈ క్రింద వివరంగా చర్చించబడింది.

కంటి చూపు మెరుగుపరచడం కోసం నిమ్మజాతి పండ్లు - Citrus fruits to improve eyesight in Telugu

కళ్ళలో మెటబోలిక్ (జీవక్రియ) చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఈ జీవక్రియ ప్రతిచర్యల ఫలితంగా ఉత్పత్తి అయ్యే టాక్సిన్లను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు నిరంతరంగా అవసరమవుతాయి. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. బెర్రీలు, కమలాలు మరియు కివీలు  వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది హానికరమైన ఆక్సిజన్ రాడికల్స్ ను నైట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా కంటి కండరాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి కళ్ళలో ఉండే రక్త నాళాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

మంచి కంటి చూపుకు పాల ఉత్పత్తులు - Dairy products for better eyesight in Telugu

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కళ్ళకు చాలా మేలు చేస్తాయి. వాటిలో విటమిన్ ఎ మరియు జింక్ ఖనిజం కూడా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది మరియు జింక్ విటమిన్ కాలేయం నుండి కళ్ళకు సరఫరా కావడంలో సహాయపడుతుంది. జింక్ కంటిలో, ముఖ్యంగా రెటీనా మరియు కోరాయిడ్ (choroid),(రెటీనాకు అంతర్లీనంగా ఉండే ఒక వాస్కులర్ కణజాలం) లో పుష్కలంగా ఉంటుంది. ఈ ముఖ్యమైన ఖనిజం రాత్రి సమయంలో దృష్టిని మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లం నివారణకు కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. రోజులో ఎప్పుడైనా భోజనంతో పాటుగా పెరుగు తినవచ్చు.

కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి నట్స్ (గింజలు) - Nuts for improved eye health in Telugu

కంటి ఆరోగ్యానికి బాదం వంటి గింజలు (గింజలు) చాలా మంచివి. బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను ప్రభావితం చేస్తే  అన్ స్టేబుల్ మొలిక్యూల్స్ నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ ఉండే ఆహారాలను తినడం వలన చాలా కంటి వ్యాధులను నివారించడంలో ఇవి సహాయపడతాయి. అత్యంత ప్రభావివంతమైన ఫలితాలను పొందడానికి బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినడం మంచిది.

కాయధాన్యాలు మరియు బీన్స్ వలన కంటి చూపు పెరుగుతుంది - Legumes and beans for increased eyesight in Telugu

బీన్స్ మరియు కాయధాన్యాలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి జింక్ మరియు బయోఫ్లేవినోయిడ్ల (bioflavonoids) యొక్క గొప్ప వనరులు, ఇవి రెటీనాను రక్షిస్తాయి మరియు కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ ఆహారంలో రాజ్మా గింజలు, పెసలు, అలసందలు, ఉలవలు, పచ్చి బఠానీలు, శనగలు మరియు మొలకలు తగినంత మొత్తంలో ఉండాలి.

మెరుగైన కంటి చూపు కోసం చిలగడదుంప - Sweet potato for improved eyesight in Telugu

చిలగడదుంప మరియు ఊదా రంగు చిలగడదుంప రెండూ చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిలో ఉండే గొప్ప రంగు జియాక్సంతిన్, లుటిన్ వంటి పిగ్మెంట్లు ఉండటం వల్ల వస్తుంది. చిలగడదుంపలలో ఈ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అవి వాపును తగ్గించడానికి మరియు టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి సహాయపడతాయి. చిలగడదుంపలను తినడానికి ఉత్తమ మార్గం వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి తినడం, అలా చేయడం వలన వాటిలో పోషకాలు తొలగిపోవు.

కంటి చూపు మెరుగుపరచడం కోసం తృణధాన్యాలు - Whole grains for increasing eyesight in Telugu

తృణధాన్యాలు కూడా కంటి చూపు మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిసింది. ఇవి ఫైబర్, విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు ఖనిజాల యొక్క గొప్ప వనరులు. విటిలో విటమిన్ ఇ మరియు జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్వినోవా, వోట్స్, తృణధాన్యాలు మరియు బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను  మీ ఆహారంలో చేర్చండి.

కంటి చూపు మెరుగుపరచడానికి చేప - Fish to improve eyesight in Telugu

చేపలు, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే చేపలు కంటి చూపును మెరుగుపరచే పోషకాహారం యొక్క గొప్ప మూలాలు. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఒమేగా -3-ఫ్యాటీ ఆసిడ్ల యొక్క గొప్ప వనరులు. ఈ కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ ఆసిడ్లు) కణాలలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫ్యాటీ ఆసిడ్ల నిష్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా వాపును తగ్గిస్తాయి. రెటీనాకు సమీపంలోని ప్రాంతంలో డిహెచ్ఏ (DHA) అనే ఒక రకమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలను తీసుకోవడం అవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నత్త గుల్లలు వంటి సీఫుడ్స్ లో కూడా జింక్ పుష్కలంగా ఉన్నందున అవి కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఒకవేళ మీరు శాఖాహారులైతే మరియు చేపలు తినకపోతే, మీ వైద్యుడిని సంప్రదించిన తరువాత మీరు చేప నూనెల (ఫిష్ ఆయిల్) సప్లిమెంట్లను తీసుకోవచ్చు. చేపలను వేపితే వాటిలో ఉండే పోషకాలు తగ్గవచ్చు కాబట్టి వాటిని గ్రిల్ చేసి తినవచ్చు.

కంటి చూపును మెరుగుపరచడానికి ఆకుకూరలు - Green leafy vegetables for increasing eyesight in Telugu

మెరుగైన దృష్టి కోసం ఆరోగ్య నిపుణులు బ్రోకలీ, కాలే మరియు బచ్చలికూర వంటి ఆకుకూరలను సిఫార్సు చేస్తారు. బ్రోకలీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూరగాయ. దీనిలో ఉండే విటమిన్లు ఎ, ఇ, సి మరియు ల్యూటిన్ బ్రోకలీని కళ్ళ కోసం ఒక అద్భుతమైన ఆహారంగా చేస్తాయి. ఫోటోడామేజ్ మరియు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా బ్రోకలీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేడి నీటిలో ఉడకబెట్టి లేదా వేపి తీసుకున్నపుడు బ్రోకలీ యొక్క ప్రయోజనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

బచ్చలికూర మరియు కాలే రెండింటిలో కంటి చూపును మెరుగుపర్చడంలో అద్భుతాలు చేయగల విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ల్యూటిన్ మరియు జింక్ యొక్క గొప్ప వనరులు, ఇవి రెండూ ఆరోగ్యకరమైన కళ్ళకు అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి  బచ్చలికూర మరియు కాలేని స్మూతీలు మరియు సూప్‌లలో చేర్చవచ్చు.

ఆరోగ్యకరమైన కళ్ళకు గుడ్లు - Eggs for healthy eyes in Telugu

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో గుడ్లును ఉత్తమమైన  ఆహారంగా భావిస్తారు. గుడ్డు సొనలలో విటమిన్ ఎ, జియాక్సంతిన్ (zeaxanthin), ల్యూటిన్ మరియు జింక్ అధికంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి కీలకమైనవి. విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని, అంటే కార్నియాను రక్షిస్తుంది. లుటిన్ మరియు జియాక్సంతిన్ మాక్యులర్ డిజనెరేషన్ మరియు కంటిశుక్లం వంటివి వయస్సు-సంబంధిత కంటి సమస్యల యొక్క సంభావ్యతను  తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడానికి అవసరమైన రెటీనాను కాపాడడంలో  జింక్ సహాయపడుతుంది.

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు ఉడకబెట్టి తినవచ్చు.

కంటి చూపు కోసం క్యారెట్లు - Carrots for eyesight in Telugu

కంటి చూపును మెరుగుపర్చడానికి పోషకాహార నిపుణులు సూచించే ఒక సాధారణ ఆహార పదార్థం క్యారెట్. వీటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, బీటా కెరోటిన్ ఒక యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్ ఎ యొక్క పూర్వగామి (ప్రికసర్). ఆహారంలో  క్యారెట్లను తీసుకోవడం వలన అవి రాత్రి సమయంలో చూపుని మెరుగుపరుస్తాయని మరియు కంటి చూపు క్షీణించడాన్ని నివారించగలవని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఈ విటమిన్ కళ్ళ యొక్క రాడ్ (rods) మరియు కోన్ (cone) కణాలకు అవసరమైన రోడాప్సిన్ అనే పిగ్మెంట్ను పెంచడంలో సహాయపడుతుంది. ఈ కణాల యొక్క ఆక్సీకరణ నష్టం మరియు వాపు కళ్ళ సమస్యలకు రెండు ప్రధాన కారణాలు, వీటిని నివారించడానికి కూడా క్యారెట్లు సహాయపడతాయి.

పచ్చి క్యారెట్లు గరిష్ట పోషణను అందిస్తాయి ఎందుకంటే వాటిని వండటం వల్ల వాటిలో ఉన్న పోషక విలువ కొద్దిగా తగ్గుతుంది. వాటిని సలాడ్ల రూపంలో పచ్చిగా తినవచ్చు లేదా వాటిని సూప్‌లకు జోడించవచ్చు. అయితే, విటమిన్ ఎ అధిక మోతాదు కూడా విషపూరితమైనది కాబట్టి క్యారెట్లను అతిగా తినడం కూడా హానికరం.

ఆహారాన్ని మెరుగుపరచడం అనేది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఒక మార్గం. ఇది కాకుండా, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీరు కొన్ని శిక్షణా వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామాలు కంటి కణాలను పునర్నిర్మించడానికి మరియు అరిగిపోకుండా ఉండడానికి  సహాయపడతాయి తద్వారా కంటి చూపు మరియు కళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అటువంటి కొన్ని వ్యాయామాలు ఈ క్రింద వివరంగా వివరించబడ్డాయి.

ఆరోగ్యకరమైన కళ్ళ కోసం మిటకరించడం (బ్లింకింగ్) - Blinking for healthy eyes in Telugu

తరచుగా మరియు అప్రయత్నంగా కళ్ళు మిటకరించే (రెప్పపాటులు) అలవాటును పాటించాలి. బ్లింక్ చేయడం (రెప్పపాటు) రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది: ఇది కళ్ళను ల్యూబ్రికేట్ చేస్తుంది మరియు కన్నీళ్లతో వాటిని శుభ్రపరుస్తుంది మరియు ఇది కంటి కండరాలకు విశ్రాంతి కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

కంటి చూపు మెరుగుపరచడానికి కంటి మసాజ్ - Eye massage to improve eyesight in Telugu

కంటి కండరాలు కూడా ఒత్తిడికి గురవుతాయి మరియు మసాజ్ (మర్దన) దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. మీ కణతలపై మీ బొటనవేళ్లను చిన్నగా తిప్పుతూ, ఒక దిశలో 20 సార్లు, మరొక దిశలో 20 సార్లు మసాజ్ చేయండి. నుదిటి వద్ద కనుబొమ్మల మధ్య, ముక్కు యొక్క రెండు వైపులా, కళ్ళ క్రింద అదే విధానాన్ని పునరావృతం చేయండి.

మెరుగైన కంటి చూపు కోసం పామింగ్ వ్యాయామం - Palming exercise for improved eyesight in Telugu

ఈ వ్యాయామం చేయడానికి, పేరు సూచించినట్లు, మీరు మీ అరచేతులను (పామ్స్) ఉపయోగించుకుంటారు. మీ కళ్ళు మూసుకుని, వాటి మీద మీ అరచేతులను పెట్టండి, మీ నుదిటిపై రెండు చేతుల వేళ్లు ఉండాలి. అయితే, మీ అరచేతులతో కనురెప్పలపై ఎలాంటి ఒత్తిడి కలిగించవద్దు. సాధారణంగా ఈ స్థితిలో, మీకు తీవ్రమైన చీకటి/నలుపుదనం కనిపిస్తుంది, ఇది సంపూర్ణ విశ్రాంతి స్థితిని సూచిస్తుంది. కాంతి, ఏవైనా ప్రకాశవంతమైన రంగు లేదా బూడిద రంగు మచ్చల యొక్క భ్రమలు ఉంటే మీరు కొంతవరకు ఆందోళన/ఒత్తిడిలో ఉన్నారని సూచిస్తాయి. అలాగే, నల్లదనాన్ని చూడటం కోసం దృష్టి కేంద్రీకరించకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ ప్రయత్నం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. బదులుగా, మీ మెడ మరియు భుజాలను విశ్రాంతిగా ఉంచి మీ మనస్సును తేలికపరిచే ఆహ్లాదకరమైన విషయాలని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించండి. పామింగ్ యొక్క గడువు మరియు తరచుదనాన్నిపెంచడం ద్వారా, మీ కళ్ళు చుట్టూ ఉండే కండరాల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి శిక్షణ పొందుతాయి, తదుపరి ఇది మీ దృష్టికి ప్రయోజకరంగా ఉంటుంది.

మెరుగైన కంటి చూపు కోసం స్వింగింగ్ వ్యాయామం - Swinging exercise for better eyesight in Telugu

ఈ వ్యాయామం మొత్తం శరీరం కోసం ఇది  అలసట మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు కళ్ళ యొక్క చైతన్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామం చేయడానికి, నిటారుగా నుంచుని మీ పాదాలను ఒకదానికొకటి 12 అంగుళాల దూరంలో ఉండేలా పెట్టండి. ఇప్పుడు, మీ శరీరాన్ని కొద్దిగా ఎడమ వైపుకు తిప్పండి, మీ బరువును మీ ఎడమ పాదం మీద మోపండి, అదే సమయంలో మీ కుడి మడమను నేల  మీద నుండి పైకి లేపండి. మీ భుజాలు మరియు మెడను నిటారుగా ఉంచండి. అప్పుడు వేరే పక్కకు తిరిగి, మీ బరువును ఇతర పాదం మీదకు మార్చండి. ఏదైనా ఒకే వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. రిలాక్స్‌గా ఉండండి మరియు పక్క నుండి మరొక ప్రక్కకు ఈ స్వింగ్ ను దాదాపు 100 సార్లు పునరావృతం చేయడానికి ప్రయత్నించండి. మీరు రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయవచ్చు. నిద్రవేళకు ముందు దీనిని చేయడం వలన నిద్రలో కళ్ళు  ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే అన్ని సరైన ఆహార పదార్థాలు మరియు వ్యాయామాల గురించి ఇప్పుడు మీకు తెలుసు, ఆరోగ్యకరమైన కళ్ళును పొందడానికి  మీరు తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి మరియు మీ జీవనశైలిలో కొన్ని శిక్షణా వ్యాయామాలను కూడా చేర్చాలి.

వనరులు

  1. Megan Migliozzi et al. Lentil and Kale: Complementary Nutrient-Rich Whole Food Sources to Combat Micronutrient and Calorie Malnutrition . Nutrients. 2015 Nov; 7(11): 9285–9298. PMID: 26569296
  2. Danielle Swanson, Robert Block, and Shaker A. Mousa. Omega-3 Fatty Acids EPA and DHA: Health Benefits Throughout Life. Adv Nutr. 2012 Jan; 3(1): 1–7. PMID: 22332096
  3. Zhibin Liu et al. In vitro and in vivo evaluation of the prebiotic effect of raw and roasted almonds (Prunus amygdalus) . J Sci Food Agric. 2016 Mar 30; 96(5): 1836–1843. PMID: 26749248
  4. National Eye Institute. Eye Health Tips. National Institutes of Health
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Keep an Eye on Your Vision Health
  6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; 10 tips for good eye health
Read on app