చింతకాయ చింత చెట్టు, టేమరిండస్ ఇండికా (Tamarindus indica) నుండి లభించే ఒక సన్నగా మరియు కొద్దిగా వంకర ఆకారంలో ఉండే పండు. చింతకాయలలో 3 నుండి 12 ఎర్రటి గోధుమ రంగు పిక్కలు ఉంటాయి వీటి చుట్టూ పుల్లని గుజ్జు ఉంటుంది. విత్తనాలు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కాయను వంటకాల్లో రుచి కోసం ఉపయోగిస్తారు. చింతపండును హిందీలో ఇమ్లీ అని పిలుస్తారు.
చింతపండు ఫాబేసీ కుటుంబానికి చెందిన ఒక లెగ్యుమ్ (చిక్కుడు). ఇది ఆఫ్రికాకు చెందినది కాని భారతదేశం ప్రపంచంలోనే చింతపండు యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారు. భారతదేశంలో, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చింతపండును సాగు చేస్తారు. నిజానికి, ఇది దక్షిణ భారత వంటకాల్లోని ప్రాధమిక పదార్ధాలలో ఒకటి.
చింతపండును పచ్చిగా తినవచ్చు లేదా సూప్‌లు, సాస్‌లు, కూరలు మరియు పచ్చడిలో కూడా ఉపయోగించవచ్చు. పచ్చి చింతకాయలను అన్నం, చేపలు మరియు మాంసాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు, గుజ్జు మాత్రమే కాకుండా, చింత చెట్టు పువ్వులు మరియు ఆకులను కూడా వంటలలో ఉపయోగించవచ్చు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, ఇమ్లీ గోలీ (చింతపండుతో చేసిన మిఠాయి) భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయంగా తీసుకుంటారు.
చింతపండు కేవలం రుచినిచ్చే ఏజెంట్ మాత్రమే కాదు. ఇది యుగాలుగా ఒక సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. చింతపండు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇది కొన్ని రకాల అల్సర్ల నివారణకు కూడా సహాయపడుతుంది. ఎండబెట్టి మరియు ఉడకబెట్టిన చింత పువ్వులు మరియు ఆకులను బెణుకులు, బొబ్బలు, కీళ్ళ వాపు మరియు కండ్లకలకలకు ఒక సమర్థవంతమైన ఔషధంగా భావిస్తారు.
చింతకాయ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: టేమరిండస్ ఇండికా (Tamarindus indica)
- కుటుంబం: ఫాబేసి (Fabaceae)
- సాధారణ పేరు: చింతపండు, ఇమ్లీ (హిందీ)
- సంస్కృత పేరు: చించ్చ (चिञ्चा)
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: తూర్పు ఆఫ్రికాలోని మడగాస్కర్ చింతపండు యొక్క మూలం అని నమ్ముతారు. భారతదేశం, థాయిలాండ్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మధ్య మరియు దక్షిణ అమెరికా చింతపండును సాధారణంగా పండించే దేశాలు.
- ఆసక్తికరమైన విషయం: దేవాలయాలలో ఇత్తడి దీపాలు, విగ్రహాలు మరియు ఫలకాలను శుభ్రపర్చడానికి చింతపండు గుజ్జును ఉపయోగిస్తారు.