"యాజ్ కూల్ యాజ్ కుకుంబర్” (as cool as a cucumber-కీర దోసకాయ లాగా చల్లగా) అనే ఓ ఆంగ్ల పలుకుబడిని విన్నపుడు మీకేదైనా ఓ మంచి అనుభూతి గుర్తుకు వస్తోందా? అవును మరి, ఓ మండు వేసవిరోజున కరకరలాడే చల్ల చల్లని కీర దోసకాయను (మసాలా దట్టించి) తినడం లాంటి ఆనందం మరోటి లేదని అందరూ అంగీకరిస్తారు. “కుకుమిస్ సాటివుస్” అనేది కీరదోసకు ఉన్న వృక్షశాస్త్రం పేరు. కీరదోసకాయలు మండు వేసవిలో వేడిని నిరోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కీరదోసకాయ గుమ్మడి కుటుంబం, ‘కుకుర్బిటాసియా’ కు చెందినది. కీరదోసకాయ కూరగాయల వర్గానికి చెందినదిగా విస్తృతంగా వర్గీకరించబడినప్పటికీ, ఇది కీరదోస పువ్వుల నుండి పెరుగుతుంది మరియు ఈ కీరదోసకాయ విత్తనాల్ని కలిగి ఉంటుంది. అందువల్ల కీరదోస నిజానికి ఒక రకమైన పండు.
దోసకాయలు వేర్వేరు ఆకారాలు, పరిమాణాలు మరియు రంగులలో పెరుగుతాయి మరియు మీ పెరట్లో కూడా సులభంగా పెరుగుతాయి కీరదోసలు. విత్తనాల ఉపయోగం మరియు వాటి ఉనికి ఆధారంగా, దోసకాయ మూడు రకాలుగా ఉంటుంది. ఒక రకం విత్తనాలు లేనివి. ఇతర రెండు రకాలు వాటి ఉపయోగం ఆధారంగా ఉంటాయి; ముక్కలు కోసుకుని ముడిగానే తినదగినవి లేదా ఊరగాయగా పెట్టుకుని తినదగినవి. దోసకాయ యొక్క అనేక రకాలు ఈ 3 ప్రాథమిక రకాలు నుండి అభివృద్ధి చేయబడ్డాయి. కీరదోస భారత ఉపఖండం నుండి ఉద్భవించిందని ప్రసిద్ధి కానీ ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు.
దోసకాయ యొక్క మొట్టమొదటి సాగు సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటిది. దీన్ని భారతదేశంలో మొట్టమొదటగా పండించారు, తర్వాత గ్రీస్ మరియు ఇటలీ ద్వారా యూరప్కు వ్యాపించింది. నిజానికి, సంప్రదాయ భారతీయ ఔషధం పురాతన కాలం నుంచి కీరదోసకాయను ఉపయోగిస్తోంది. కీరదోసకాయ వినియోగ0 గురి0చి బైబిలులో కూడా ప్రస్తావించబడింది. ప్రస్తుతం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండిస్తున్నారు. చైనా దోసకాయలు మరియు కీరదోసకాయలకు (గెర్కిన్లకు) ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. కీరదోసకాయల మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో ఒక్క చైనానే 77% పండిస్తోంది.
రసంతో కూడిన దోసకాయ తినడానికి కరకరలాడుతుంటుంది కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ తిని ఆనందిస్తున్నారు. మొత్తం కీరదోసకాయను మొత్తం తినొచ్చు, అంటే కీరదోసకాయపై ఉండే తొక్క మరియు విత్తనాలతో పాటు తినడమే మరింత ఆరోగ్యకరం. అధిక నీటిశాతాన్ని కల్గి ఉండేదిగా కీరదోసకాయను ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. కానీ కీరదోసకాయలు తినడంవల్ల కలిగే ఉత్తమ ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదు. కీరదోసల్లో ఫైటోన్యూట్రిఎంట్లనబడే పోషకాలున్నాయి, ఇవి మొక్క రసాయనాలు. ఈ మొక్క రసాయనాలు మనల్ని వ్యాధుల్నుండి రక్షిస్తాయి. అంతేకాక, పొటాషియం వంటి ఖనిజాల్ని, కాల్షియం, మరియు వివిధ విటమిన్లను కీరదోసకాయ కల్గి ఉంది.
భారతదేశంలో “కీర”, “ఖీరా” అని పిలువబడే ఈ కీరాదోసకాయ, వేడి వాతావరణాల్లో బాగా పండుతుంది. కీరదోసకాయ తీగకు కాస్తుంది. ఈ తీగ మొక్కకు క్రమంగా నీటిని పోస్తుంటేచాలు, దీనికి అంతకు మించి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. కీరదోసకాయను పచ్చికాయగానే, అంటే ముడిగానే, తింటారు లేదా సలాడ్లుగా మరియు మధ్యధరా వంటలలో ఉపయోగిస్తారు. కొన్ని ఆసియా వంటకాల్ని దోసకాయతో తయారు చేస్తారు. సాదా నీటికి ప్రత్యామ్నాయంగా దోసకాయ ముక్కలను నానబెట్టిన నీటిని తాగడంవల్ల అది మన శరీరంలో నిర్విషీకరణం (detoxifying) గా పని చేస్తుంది. కాబట్టి సాదా నీరు కంటే ఇలా కీరదోస ముక్కలు నానబెట్టిన నీటిని తాగడం ఆరోగ్యకకరం.
కీర దోసకాయల గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామం: కుకుమిస్ సాటైవస్ (Cucumis sativus)
- కుటుంబం: కుకుర్బిటసే
- సాధారణ పేరు: కీరదోసకాయ, ఖీరా
- సంస్కృతం పేరు: ఉర్వరుకం
- ఉపయోగించే భాగాలు: కీరదోసకాయ యొక్క కండ (ఫ్లెష్), విత్తనాలు మరియు తొక్క అన్నింటినీ అట్లే (ముడిగానే) పచ్చిగానే తినొచ్చు. ఊరగాయగా పెట్టుకుని కూడా కీరదోసల్ని తినొచ్చు.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కీరదోసలు పురాతన భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయమయ్యాయి. మొదట ఇవి అడవుల్లోనే పండేవి. గ్రీకులు మరియు ఇటలీవారు ఐరోపాకు పరిచయం చేశారు, అయితే దీనిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పరిచయం చేసింది ఆ దేశానికెళ్ళే వలసదారులే.
- ఆసక్తికరమైన విషయాలు: జపాన్లోని బౌద్ధ దేవాలయపు పూజారులు సురక్షితమైన వేసవి కొరకు ప్రార్థన చేస్తూ, కీరదోసకాయతో దీవెనలందించే సంప్రదాయాన్ని పాటిస్తారు. రోమన్ చక్రవర్తి టిబెరియస్ ఏడాది పొడవునా తన టేబుల్పై ఒక కీరదోసకాయను ఉంచాలని పట్టుబట్టేవారట. ఏడాది పొడవునా కీరదోసకాయను పండించడానికి గ్రీన్హౌస్-వంటి పద్ధతులను కూడా ఆ చక్రవర్తి ఉపయోగించేవాడట.