కాఫీ అనేది అద్భుతమైన శక్తులు గల ఒక అద్భుతమైన పానీయము. ఒక శీతాకాలపు చలి రోజున ఒక కప్పు కాఫీ అంటే ఎవరు ఇష్టపడరు! ఈ ముదురు రంగు కషాయము రుచిలో కాస్త చేదుగా మరియు కొంతవరకు ఎసిడిక్ గా కూడా ఉంటుంది. ఐతే, ఆవిర్లు గ్రక్కుతున్న కాఫీ లేకుండా ఏ బ్రేక్‌ఫాస్ట్ కూడా పూర్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 400 బిలియన్ కప్పుల కాఫీ త్రాగుతున్నారనే అంచనా తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు.
మనకు తెలిసిన సువాసన గల కాఫీ గింజలు, వాస్తవంగా కాఫీ కాయల నుండి తీసి వేయించబడిన విత్తనాలు. కాఫీ యొక్క సువాసన మరియు రుచి, కాఫీ గింజలు వేయించిన స్థాయిపై ఆధారపడి ఉంటుంది. అరేబికా మరియు రోబస్టా అనేవి కాఫీ యొక్క అత్యంత ప్రజాదరణ గల రెండు రకాలు. అయినప్పటికీ, అరబిక్ కాఫీ అత్యంత శ్రేష్టమైన కాఫీగా పరిగణించబడుతోంది మరియు అది శ్రేష్టమైన పరిమళము మరియు రుచిని కలిగి ఉంటుంది. కాఫీ ఎక్కువగా వేడిగానే ఇవ్వబడుతుంది. ఐతే చల్లని కాఫీ కూడా ఒక ప్రముఖమైన పానీయం.
ప్రపంచములో బ్రెజిల్ కాఫీ పంట యొక్క అతి పెద్ద ఉత్పాదక దేశంగా ఉంది. ఇండియాలో, అత్యంత ఎక్కువగా కాఫీ పండించే రాష్ట్రాలుగా, మొత్తం కాఫీ ఉత్పత్తిలో 71% ఆక్రమిస్తున్న కర్ణాటక, ఆ తర్వాత కేరళ మరియు తమిళనాడు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర కాఫీ ఉత్పత్తిలో చిక్కమగళూరు మరియు కొడగు ప్రాంతాలు 80% కంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
ఒక పానీయముగా కాఫీ విజయానికి అత్యంత ప్రధాన దోహదాంశము కెఫెయిన్ పదార్థాంశము, అది మానవ శరీరముపై శక్తినిచ్చు ప్రభావాలను కలిగి ఉంటుంది. ఐతే, ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగియుంది. అది, క్రుంగుబాటును నయం చేయడానికి, రొమ్ము క్యాన్సర్ ని నివారించుటకు సహాయపడగలుగుతుంది మరియు కాలేయమును రక్షించుటకు కూడా తోడ్పడుతుంది. ఇది, శరీరాన్ని ఉత్తేజపరచేందుకు సహాయపడే యాంటీఆక్సిడంట్లు మరియు ఇతర జైవిక సమ్మేళనాలకు ఒక సమృద్ధమైన మూలము.
కాఫీ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్ర సంబంధిత నామము: కాఫియా
- కుటుంబము: రుబియాసియే
- సాధారణ నామము: కాఫీ
- సంస్కృత నామము: కాఫీ (Coffee) / పీయుష్ (Piyush)
- ఉపయోగించబడే భాగాలు: కాఫీ గింజలు
- జన్మస్థానము మరియు భౌగోళిక పంపిణీ: కాఫీ మొక్క యొక్క పుట్టుక ఇథియోపియా యొక్క కఫ్ఫా ప్రాంతములో జరిగినట్లు విశ్వసించబడుతోంది. దీని జన్మస్థానము, ఆఫ్రికాలోని సహారా-ఉప ప్రాంతపు ఉష్ణమండల ప్రదేశము. హవేలీ, మెక్సికో, ప్యుయెర్టో రికో, కోస్టా రికా, కొలంబియా, బ్రెజిల్, ఇథియోపియా, కెన్యా, ఇండియా మరియు యెమెన్ దేశాలు కాఫీ మొక్కలను పండించే కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి.
- ఆసక్తికరమైన వాస్తవము: చమురు తర్వాత కాఫీ, ప్రపంచములో అత్యంత సాధారణంగా విక్రయించబడే రెండవ ఉత్పాదనగా ఉంది.