బంగాళాదుంపలు ప్రపంచంలో అత్యంత సాధారణమైన మరియు ప్రసిద్ధ కూరగాయలలో ఒకటి. బంగాళాదుంపల వినియోగం తాజా మరియు ముడి బంగాళాదుంపల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, స్టిక్స్, మరియు పురీ వంటి క్రమికంగా (ప్రాసెస్) చేయబడిన ఉత్పత్తుల వరకు వ్యాప్తి చెందింది. బంగాళాదుంపకున్న విభిన్న ఉపయోగాలు దానికి సముచితంగా "కూరగాయల రాజు" అనే బిరుదును సంపాదించిపెట్టాయి. బంగాళా దుంపను హిందీలో “ఆలూ” అని, ఆంగ్లంలో ‘పొటాటో’ అని పిలుస్తారు. తెలుగులో దీన్ని “ఉర్లగడ్డ” అని కూడా పిలుస్తారు.
బంగాళాదుంప భూగర్భ పంట, అంటే అవి భూమి పైన ఆకులు మరియు కొమ్మలతో విస్తరించి నేలలోపల గడ్డగా పెరుగుతాయి. వృక్షశాస్త్రజ్ఞుల ప్రకారం, బంగాళదుంపలు తినదగిన దుంపలు లేక గొట్టంలాంటి గడ్డలు, అంటే ఇవి బంగాళాదుంప మొక్క యొక్క కండగల కాండం అని అర్థం. బంగాళా దుంప యొక్క ఉత్తమ అంశం ఏమంటే వీటిని పండించడం సులభం మరియు ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. నిజానికి, బంగాళాదుంపలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద గడ్డ దినుసు ఆహార పంటలు. బంగాళాదుంపలు ప్రత్యేకమైన ప్రధానమైన పంటలు (staple crop), దీనిలో కూరగాయలకు సామాన్యంగా ఉండే బంక, గంజి మరియు పిండిపదార్థ గుణాన్ని కలిగివుంటాయి. క్రీ.పూ 8000 నుండి సుమారు క్రీ.పూ 5,000 వరకు పెరూలోని ‘ఇంకా ఇండియన్లు’ అనే దక్షిణ అమెరికన్ ఇండియన్లు మొట్టమొదట బంగాళా దుంపను పండించారు. బంగాళాదుంపను స్పెయిన్ దేశస్థులు 16 వ శతాబ్దంలో ఐరోపాకు తీసుకువచ్చారు. ఆసక్తికరంగా, ప్రపంచంలో 4 నుండి 5 వేల రకాల బంగాళాదుంపల రకాలున్నాయి.
నీరు మరియు కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కల్గిన బంగాళదుంపలు రుచికరమైన వంటకాలకు పనికి వస్తాయి. తక్కువ కార్బ్ ఉన్న ఆహారాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న కారణంగా, బంగాళాదుంప యొక్క ప్రజాదరణ గణనీయంగా పడిపోయింది. కానీ, అది మనకు అందించే విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ మరియు పీచుపదార్థాలు (ఫైబర్లు) వ్యాధులను మన నుండి దూరంచేస్తాయి, అంతేగాక మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకు చేకూరుస్తుంది.
బంగాళదుంపలు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: సోలానమ్ ట్యుబెరోసం (Solanum tuberosum)
- కుటుంబం: సోలనాసియా (Solanaceae)
- సాధారణ పేర్లు: బంగాళదుంపలు, ఆలు
- సంస్కృత నామం: ఆలుక్ (आलुक) (అలూకుం, āluḥ)
- ఉపయోగించే భాగాలు: బంగాళాదుంప పై ఉండే తోలు/తొక్క, గడ్డ
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బంగాళాదుంపల్ని మొదట పెరులో “ఇంకా” తెగవారు లేదా “ఇంకా ఇండియన్లు క్రీ.పూ 8,000 నుండి క్రీ.పూ 5,000 వరకు సాగు చేశారు. వీటిని 16 వ శతాబ్దం రెండవ భాగంలో, ఐరోపా ఖండంలో స్పెయిన్ దేశీయులు సాగుచేయడం ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి. 1900 ల ఆరంభంలో, మాజీ సోవియట్ యూనియన్తో సహా అనేక ఐరోపా దేశాలు బంగాళాదుంపలను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడం మరియు దిగుమతి చేసుకోవడం జరిగేది. 1960 లలో ఆసియన్లు, ఆఫ్రికన్లు మరియు లాటిన్ అమెరికావాసుల్లో కూడా బంగాళాదుంప ప్రజాదరణ పొందింది. బంగాళదుంపలు ఇప్పుడు చైనా మరియు భారతదేశం చేత విస్తృతంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. బంగాళదుంపల అతిపెద్ద ఉత్పాదక దేశం చైనా.
- ఆసక్తికరమైన నిజం: బంగాళాదుంపల ఫలదీకరణం తుమ్మెదల చేత చేయబడుతుంది.