టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్ ఏమిటి?
టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్ అంటే పుట్టుకతోనే గుండెలో వచ్చే నాలుగు రకాలైన లోపాల (birth defects) కలయిక. ఇది మొత్తం శరీరంలో ప్రసరించే రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువ కావడానికి కారణం అవుతుంది. ఈ పరిస్థితికి కారణయ్యే నాలుగు లోపాలు:
- వెన్డ్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD, Ventricular septal defect), ఇది స్థితిలో కుడి మరియు ఎడమ వెంట్రికల్స్ (గుండె యొక్క గదులు [ఛాంబర్లు]) యొక్క కలియికలో లోపం ఏర్పడుతుంది
- కుడి వెంట్రికల్ (జఠరిక) గట్టిపడటం
- గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్లే రక్త ప్రసరణలో నిరోధం ఏర్పడడం
- అయోర్టా (శరీరంలో ప్రధాన ధమని [ఆర్టరీ]) సరైన స్థానంలో లేకపోవుట
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్తో బాధపడుతున్న వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం ఆక్సిజన్-అధికంగా ఉన్న రక్తం లేకపోవటం వల్ల చర్మం నీలం రంగులోకి మారిపోవడం. ఈ పరిస్థితి యొక్క ఇతర లక్షణాలు:
- వేళ్లు దగ్గరికి ముడుచుకుపోవడం
- ఆకస్మికంగా స్పృహ తప్పిపోవడం
- చర్మం ఆకస్మికంగా తీవ్ర నీలం రంగులోకి మారిపోతుంది
- శారీరక శ్రమ తక్కువగా ఉన్నపటికీ సులువుగా అలసట కలగడం
- బలహీనత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్ అభివృద్ధికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, కానీ ఈ పరిస్థితికి దారితీసే కొన్ని సంకేతాలు:
- గర్భధారణ సమయంలో ఆహార లోపం ఉండడం లేదా సరిగ్గా ఆహారం తీసుకొని కారణంగా, శిశువు గుండె లోపములతో పుట్టవచ్చు
- టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్ అభివృద్ధి చెందడానికి మధుమేహం కూడా ఒక కారణమని భావిస్తారు
- డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలలో ఈ పరిస్థితి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
అసాధారణ హృదయ స్పందన ఉన్న శిశువులో టెట్రాలాజి ఆఫ్ ఫాలోట్ను ఒక సాధారణ అల్ట్రాసౌండ్ ద్వారా నిర్దారించవచ్చు. జనన సమయంలో శిశివు చర్మం నీలి రంగులో ఉన్నట్లయితే, వైద్యులు పరీక్షలను ఆదేశించవచ్చు. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి సాధారణంగా నిర్వహించే పరీక్షలు ఈ కింది విధంగా ఉంటాయి:
- గుండెకు ఎంఆర్ఐ (MRI)
- ఛాతీ యొక్క ఎక్స్- రే
- గుండె నిర్మాణం లేదా పనితీరులో ఏవైనా అసాధారణతలను తనిఖీ చేయడానికి ఎకోకార్డియోగ్రామ్ (echocardiogram)
ఈ పరిస్థితికి చికిత్స అంటే లోపాలను సరిచేసేందుకు గుండె యొక్క శస్త్రచికిత్స మాత్రమే. శిశువు బలహీనంగా ఉన్నట్లయితే, శిశువు ఆరోగ్యాన్ని పొందే వరకు మరియు పూర్తి శస్త్రచికిత్స కోసం సిద్ధంగా అయ్యేవరకు ఒక తాత్కాలిక మరమ్మత్తు (రిపేర్) జరగవచ్చు. ఈ శస్త్రచికిత్స సాధారణంగా శిశువు పుట్టిన కొన్నిరోజులలోనే నిర్వహిస్తారు, ఎందుకంటే చికిత్స ఆలస్యమైతే ఈ పరిస్థితి గుండె లయకు ఆటంకాలు, మూర్ఛలు మరియు అభివృద్ధిలో ఆలస్యం కావడం వంటి సమస్యలకు కారణం కావచ్చు.