ప్రసవం తర్వాత రక్తస్రావం అంటే ఏమిటి?
ప్రసవం తర్వాత రక్తస్రావం అనేది యోని ద్వారా రక్తస్రావం జరిగే ఒక సాధారణ ప్రక్రియ. ఇది సాధారణ ప్రసవం మరియు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం కావడం రెండింటిలోనూ జరుగుతుంది. ప్రసవం అయిన మొదటిరోజున రక్త నష్టం (స్రావం) చాలా ఎక్కువగా ఉంటుంది మరియు తరువాత నెమ్మదిగా తగ్గుతూ, చివరకు కొన్ని వారాలకు పూర్తిగా తగ్గిపోతుంది. పోస్ట్-పార్టామ్ హేమరేజ్ (పిపిహెచ్, Post-partum haemorrhage) అనేది ప్రసవం తర్వాత 24 గంటలలో అధిక రక్త స్రావం కావడం, ఇది సాధారణ ప్రసవాలలో 500 మి.లీ.ల వరకుమరియు సిజేరియన్ (శస్త్రచికిత్స ) ప్రసవాలలో 1000 మి.లీ.ల వరకు ఉంటుంది. ప్రసవం తర్వాత రక్తస్రావాన్ని లోకియ (lochia, మైల) అని కూడా అంటారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిపిహెచ్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- రక్తపోటు తగ్గిపోవడం
- అధిక రక్తస్రావం
- హృదయ స్పందన రేటు పెరగడం
- ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం
- యోని లోపల మరియు దాని చుట్టుపక్కల వాపు మరియు నొప్పి
- బలహీనత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రసవం తర్వాత, గర్భాశయం (uterus) సంకోచించి యోని ద్వారా మాయ (placenta) ను బయటకు పంపుతుంది. మాయను బయటకు పంపించిన తర్వాత కూడా గర్భాశయం సంకోచించి ఉండి పోతుంది. గర్భాశయం తగినంతగా సంకోచించకపోతే పిపిహెచ్ సంభవిస్తుంది. ప్రసవం తర్వాత కూడా ప్లాసెంటా (మాయ) యొక్క చిన్న భాగం గర్భాశయానికి అంటుకుని ఉండిపోతే కూడా ఇది సంభవించవచ్చు. కొన్ని ఇతర కారణాలు:
- హీమోఫిలియా లేదా విటమిన్ కె (K) లోపం వంటి రక్తం గడ్డకట్టడంలోని రుగ్మతలు
- ప్లాసెంటా (మాయ) రుగ్మతలు
- యోని లేదా గర్భాశయమునకు గాయం
- రక్త నాళాలకు గాయం
- కటి వలయం (pelvic space) లోకి రక్తస్రావం కావడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నిర్ధారణ ఈ క్రింది విధంగా చేస్తారు:
- శారీరక పరిక్ష
- గుండె స్పందన రేటు మరియు రక్తపోటును కొలవడం
- రక్త కణాల సంఖ్యను అంచనా వేయడానికి రక్త పరీక్షలు
- రక్త నష్టం యొక్క అంచనా
చికిత్స యొక్క ప్రాధమిక లక్ష్యం అధిక రక్తస్రావ కారాణాన్ని గుర్తించడానికి మరియు దానికి చికిత్స చేయడం. కొన్ని చికిత్సా విధానాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- గర్భాశయ మర్దన (massages) లేదా మందుల ద్వారా గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపించడం.
- గర్భాశయం నుండి మాయ (ప్లాసెంటా) యొక్క అవశేషాలను తొలగించడం.
- రక్తస్రావాన్ని జరుపుతున్న రక్తనాళాలను మూసివేయడానికి యుటిరైన్ కంప్రెషన్ (Uterine compression, గర్భాశయ సంపీడనం).
- లాపరోటిమీ (Laparotomy, పొత్తికడుపులో చిన్న కోతలు/కాటులు పెట్టి మరియు వాటి ద్వారా లోపలికి వెళ్ళే ప్రత్యేక సాధనాలను ఉపయోగించి శస్త్రచికిత్స చేయడం).
- హీస్టిరెక్టమీ (Hysterectomy, గర్భాశయ తొలగింపు).
పిపిహెచ్ లో ద్రవాల నష్టం కూడా అధికంగా ఉంటుంది మరియు ఈ ద్రవాలను భర్తీ చేయడం అనేది చికిత్స యొక్క ముఖ్య అంశం. ఇంట్రావీనస్ ద్రవాలు (Intravenous fluids), రక్తం, మరియు రక్త ఉత్పత్తులు (blood products) ద్రవం భర్తీలో ఉపయోగపడతాయి.