మెనింజియోమా అంటే ఏమిటి?
మెనింజియోమా అనేది మెనింజెస్ లో కణితిని సూచించడానికి ఉపయోగించే పదం, మెనింజెస్ అంటే మెదడు మరియు వెన్నుపాము యొక్క రక్షణ పొరలు (coverings). మెనింజియోమా సాధారణంగా క్యాన్సర్ కానివి మరియు అవి చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వర్గీకరణ ప్రకారం మెనింజియోమాలు వాటి స్థానం మరియు స్థాయి ఆధారంగా వర్గీకరించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో, కణితి చాలా పెద్దగా పెరిగేంతవరకు లక్షణాలు పైకి కనిపించవు మరియు దానికి చికిత్స కూడా ఉండదు లేదా కఠినతరం అవుతుంది. మెనింజియోమా యొక్క అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- నిరంతర తలనొప్పులు
- ఆకస్మిక మూర్ఛలు
- వినడం లోపం లేదా చెవిలో ఎదో మోగుతున్న శబ్దం
- వికారంగా అనిపించడం
- కాళ్లలో బలహీనత
- జ్ఞాపక శక్తి తగ్గుదల
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడు కణితులకు అసలు కారణం ఇప్పటి వరకు తెలియలేదు, అయితే ఇది ఎక్కువగా క్రోమోజోమ్ 22 యొక్క మార్పు కారణంగా భావింపబడుతుంది. గతంలో తలకు రేడియేషన్ థెరపీ చేయించుకున్న రోగులు కూడా ప్రమాదానికి గురి అవుతారు. హార్మోన్లు మరియు మెనింజియోమాల మధ్య సంబంధం గురించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి.
న్యూరోఫిబ్రోమటోసిస్ టైప్ 2 (neurofibromatosis type 2),ఒక జన్యుపరమైన రుగ్మత, దీనితో బాధపడుతున్న వ్యక్తులలో కూడా మెనింజియోమాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
తరచూ మెనింజియోమా యొక్క లక్షణాలు చివరి దశలలో కనిపిస్తాయి, మరియు సాధారణంగా మరొక సమస్య కోసం నిర్వహించిన సిటి (CT) స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్లలో ఈ కణితిని యాదృచ్ఛికంగా గుర్తించడం జరుగుతుంది.
వైద్యులు వివరణాత్మక రోగి ఆరోగ్య చరిత్రను మరియు కుటుంబ చరిత్రను తీసుకుంటారు, నరాల పరీక్షలతో పాటు భౌతిక పరీక్షను నిర్వహిస్తారు మరియు మెనింజియోమా యొక్క నిర్ధారణను ధృవీకరించడానికి స్కాన్లను ఆదేశిస్తారు. మెనింజియోమా యొక్క పరిమాణం మరియు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి సిటి స్కాన్లు లేదా ఎంఆర్ఐ స్కాన్లు చేస్తారు. తదుపరి దశల్లో, రోగనిర్ధారణను ధృవీకరించడానికి రక్త నాళాల యొక్క ఆంజియోగ్రామ్ (angiogram) కూడా చేయవచ్చు.
మెనింజియోమా వృద్ధిని అరికట్టడానికి మరియు వ్యాధి యొక్క లక్షణాలను నియంత్రించేందుకు ప్రత్యేక మందులు మరియు చికిత్సలు ఉన్నాయి. చికిత్స ఎంపికలు ఈ క్రింద వివరించబడ్డాయి:
- పరిశీలన (Observation)- చాలా సందర్భాలలో మెనింజియోమా యొక్క పెరుగుదల చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు, రోగులకు కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి లేదా అసలు లక్షణాలు ఉండవు అప్పుడు వాటికి సాధారణంగా చికిత్స చేయబడదు, అయితే కణితి యొక్క పెరుగుదల మరియు లక్షణాలలో ఏవైనా మార్పుల కోసం జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు.
- శస్త్రచికిత్స (Surgery)- శస్త్రచికిత్స అనేది మెదడు కణితులకు సులువైన చికిత్సా విధానం, దీనిలో మెదడులోని ప్రభావిత ప్రాంతం లేదా కణితి శస్త్రచికిత్స ద్వారా తొలగించబడుతుంది మరియు తదుపరి వృద్ధిని నివారిచవచ్చు.
- రేడియేషన్ (Radiation) - శస్త్రచికిత్స సాధ్యం కాని ప్రాంతాల్లో రేడియోథెరపీ ఉపయోగించబడుతుంది. కేవలం ప్రభావిత ప్రాంతంలోని కణితిని చంపడానికి మరియు దాని అభివృద్ధిని నిలిపివేయడానికి రేడియేషన్ సహాయపడుతుంది.
- కీమోథెరపీ - కీమోథెరపీకి మెనింజియోమా అంతగా స్పందించదు; అయినప్పటికీ రేడియేషన్ మరియు శస్త్రచికిత్స అంతగా ప్రభావం చూపనప్పుడు ఇది మెనింజియోమా కణుతులకు ఆఖరి ఎంపికగా ఉంటుంది.