పల్మోనరీ ఎంబోలిజం అంటే ఏమిటి?
రక్తం గడ్డకట్టడం వలన ఊపిరితిత్తులలోని రక్త నాళాలు నిరోధించబడతాయి అటువంటి పరిస్థితిని పల్మోనరీ ఎంబోలిజం అని అంటారు, రక్త గడ్డ రక్తనాళాల గుండా ప్రయాణించి ఊపిరితిత్తుల దగ్గరకు చేరుకుని అక్కడ ఆగిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. గడ్డ పెద్దగా లేదా ఎక్కువ గడ్డలు ఉన్నట్లయితే ఈ పరిస్థితి ప్రాణాంతకమవుతుంది. ఇది ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది మరియు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిన కారణంగా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిపోతుంది. ఇది శరీరం యొక్క ఇతర అవయవాలకు కూడా నష్టం కలిగించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పల్మోనరీ ఎంబోలిజమ్ తో బాధపడుతున్న దాదాపు సగం మంది వ్యక్తులలో, ఏటువంటి లక్షణాలు కనిపించవు. మిగిలిన సగం మంది ఈ క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- దగ్గుతున్నపుడు రక్తం పడడం
- ఛాతి నొప్పి
- పిక్కలు లేదా తొడల యొక్క వాపు
- కాలి యొక్క నొప్పి, సున్నితత్వం మరియు ఎరుపుదనం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది చాలా సాధారణంగా డీప్ వెయిన్ థ్రోమ్బోసిస్ (deep vein thrombosis) అని పిలువబడే ఒక పరిస్థితి వలన సంభవిస్తుంది, ఇందులో కాళ్ళ యొక్క వెయిన్స్ (నరములలో) ఒక రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఈ గడ్డలు కాళ్ళ నరముల నుండి తెగి, ఊపిరితిత్తుల వైపు వెళ్ళినప్పుడు, అది పల్మోనరీ ఎంబోలిజంను కలిగించవచ్చు.
పల్మోనరీ ఎంబోలిజమ్ యొక్క ఇతర కారణాలు:
- శస్త్రచికిత్సలు, ఉదా., జాయింట్ పునఃస్థాపన శస్త్రచికిత్స (joint replacement surgery)
- హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్సలు
- గర్భనిరోధక మాత్రలు
- గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులు వంటి వైద్య సమస్యలు
- గర్భాధారణ మరియు ప్రసవం
- వంశపారంపర్యం
- ఊబకాయం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పల్మోనరీ ఎంబోలిజం యొక్క రోగ నిర్ధారణ కష్టం అయినప్పటికీ, కింది రోగనిర్ధారణ చర్యలు ఈ పరిస్థితిని ఖచ్చితంగా నిర్దారించడానికి వైద్యులకు సహాయం చేస్తాయి:
- వ్యక్తి యొక్క వివరణాత్మక ఆరోగ్య చరిత్ర
- శారీరక పరీక్ష మరియు లక్షణాల ఉనికిని గుర్తించడానికి పూర్తి తనిఖీ
- ఇమేజింగ్ పరీక్షలు
- రక్త పరీక్షలు
చికిత్స గడ్డలను కరిగించడం మరియు మరింతగా ఏర్పడకుండా నిరోధిస్తుంది. పల్మోనరీ ఎంబోలిజమ్ చికిత్స కోసం ఈ క్రింది చర్యలను ఉపయోగిస్తారు:
మందులు:
- యాంటీ కోయాగ్యులెంట్ (Anticoagulant) మందులను రక్తాన్ని పల్చబర్చడానికి సూచిస్తారు మరియు అవి గడ్డ పరిమాణం పెరగకుండా నిరోధించడం మరియు కొత్త గడ్డలు ఏర్పడకుండా నిరోధించడం చేస్తాయి.
- రక్త గడ్డను తగ్గించడానికి థ్రోంబాలైటిక్ (Thrombolytic) మందులు సూచించబడతాయి.
పద్ధతులు:
- ఒక వీనా కేవ ఫిల్టర్ (vena cava filter): ఒక వడపోత (ఫిల్టర్) వీనా కేవ నరములో పెట్టబడుతుంది, ఇది ఊపిరితిత్తుల దగ్గరికి గడ్డలు ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
- కాథెటర్-సహాయక గడ్డ తొలగింపు (Catheter-assisted removal of the clot): ఈ ప్రక్రియ లో గడ్డలను విచ్ఛిన్నం చేయడానికి ఊపిరితిత్తులలో కి ఒక మృదువైన (flexible) గొట్టం పెట్టబడుతుంది.