డైవర్టిక్యూలైటిస్ (ప్రేగులవాపు) అంటే ఏమిటి?
ప్రేగులవాపు (డైవర్టిక్యూలైటిస్) అనేది పెద్ద ప్రేగులను (large intestine) ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. డైరెటిక్యులర్ వ్యాధులలో, పెద్ద ప్రేగు యొక్క గోడల మీద చిన్న చిన్న ఉబ్బులు/కణుపులు/ సంచులు లాంటివి అభివృద్ధి చెందుతాయి. ఈ డైవర్టికులా (పెద్ద యొక్క గోడలు) వాపును డైవర్టిక్యూలైటిస్ అని పిలుస్తారు. సాధారణంగా, డైవర్టికులా ఏర్పడినప్పుడు ఏ లక్షణాలను గుర్తించలేము. అయితే, వాటికి ఇన్ఫెక్షన్ (సంక్రమణ) సోకినా లేదా వాచినప్పుడు, తీవ్ర నొప్పిని కలిగిస్తాయి. తినే ఆహారంలో తగినంత ఫైబర్ (పీచు పదార్థం) లేనప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డైవర్టిక్యూలైటిస్ యొక్క లక్షణాలు ఈ క్రింద ఉన్నాయి:
- తీవ్రమైన కడుపు నొప్పి, ముఖ్యంగా ఎడమ వైపున
- 38 C (104 F) లేదా ఆ పైన ఉండే జ్వరం
- తరచుగా మల విసర్జన
- వాంతులు
- అలసినట్లు అనిపించడం
- మలంలో రక్తస్రావం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
డైవర్టిక్యూలైటిస్ సాధారణంగా తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం మరియు వృద్ధాప్యంతో ముడి పడి ఉంటుంది. అలాగే జన్యుపరమైన కారణం కూడా ఉండవచ్చు. ప్రేగు యొక్క గోడలోని బలహీన ప్రాంతాలలో ఏర్పడిన చిన్న సంచులలాంటి నిర్మాణాలను డైవర్టికులా అని పిలుస్తారు, అవి వాచీనప్పుడు డైవర్టిక్యూలైటిస్ సంభవిస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది, ప్రధానంగా చీమును (కురుపులను) ఏర్పరుస్తుంది.
ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియకపోయినా, ఇది తరచూగా ఊబకాయం ఉన్నవారిలో, సుదీర్ఘకాలంగా నొప్పి నివారణలను (painkillers) ఉపయోగించిన వారిలో మరియు మలబద్ధకం ఉన్నవారిలో కనిపిస్తుంది.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
ఎక్కువగా ఉదరభాగంలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నప్పుడు డైవర్టిక్యూలైటిస్ను నిర్ధారణ చేయవచ్చు. వైద్యులు మలద్వార పరీక్షతో పాటు సమగ్రమైన భౌతిక పరీక్షను నిర్వహిస్తారు. వైద్యుడు రోగి ఆహారపు అలవాట్లను గమనించవచ్చు. సంక్రమణ (ఇన్ఫెక్షన్) నిర్దారణ కోసం రక్త పరీక్ష చేయవచ్చు. కొలొనోస్కోపీ (Colonoscopy) చేయబడుతుంది తద్వారా వైద్యులు ప్రేగులను లోపల నుండి చూడవచ్చు. ఎక్స్-రే ను నిర్వహించే ముందు, వైద్యుడు ప్రేగులోకి పాయువు (anus) ద్వారా వ్యత్యాసంగల రంగును (contrasting dye) (అది సహజంగా బేరియం) వ్యాపింపచేస్తాడు. సిటి (CT) స్కాన్ ప్రేగు గోడల వెలుపల ఏర్పడిన కురుపులను గుర్తించడానికి నిర్వహించబడుతుంది. మలంలో రక్తాన్ని గుర్తించడానికి మల తనిఖీ కూడా నిర్వహించబడుతుంది.
డైవర్టిక్యూలైటిస్ ఒక వైద్య సంబంధమైన అత్యవసరమని గుర్తించాలి మరియు వెంటనే దానికి వైద్య సంరక్షణ అవసరం. సంక్రమణను నియంత్రించటానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి అలాగే నొప్పి-ఉపశమన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రేగులకు విశ్రాంతి/విరామం అందించడానికి ఇంట్రావీనస్ ద్రవం (Intravenous fluid) ఇవ్వడం జరుగుతుంది. ప్రేగులలో అడ్డంకులు ఏర్పడడం వంటి సమస్యల విషయంలో, కొలెక్టమీ (colectomy) అని పిలవబడే శస్త్రచికిత్స చేయవచ్చు, దీనిలో ప్రేగు యొక్క ప్రభావిత భాగం తొలగించబడుతుంది. కొలెక్టమీ తరువాత, ఉదర గోడలో రంధ్రము ద్వారా ప్రేగు యొక్క ఆరోగ్యకరమైన కొసను బయటకు తీసుకువచ్చి దానిని మలాన్ని సేకరించే సంచికి కలుపుతారు దానికోసం కొలోస్టోమీ (colostomy) అనే ప్రక్రియను నిర్వహిస్తారు. అది ఆరు నుండి 12 నెలల వరకు ఉండే ఒక తాత్కాలిక పద్ధతి.
ఆహారంలో అధికంగా ఫైబర్ తీసుకోవడం, ద్రవాలాను తీసుకోవడం మరియు ప్రేగు పనితీరును మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొన్ని నివారణ చర్యలను అనుసరించాలి.