ఎముక మజ్జ మార్పిడి లేక బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి?
ఎముక మజ్జ మార్పిడి (BoneMarrowTransplant-BMT) ప్రక్రియనే, “స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్” అని కూడా పిలుస్తారు. ఈ ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో నిష్క్రియమైన ఎముక మూల కణాలు కల్గిన వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఎముక మూల కణాల్ని మార్పిడి చేస్తారు. ఎముక మజ్జ అనేది ప్రతి ఎముక లోపల ఉన్న ఒక మెత్తటి కణజాలం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్తపట్టికల (ఫలకికలు-platelets) ఉత్పత్తికి అవసరమైన స్టెమ్ కణాలు ఈ ఎముక మజ్జలోని భాగమే.
2014 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో నిర్వహించే BMT విధానం ఇతర దేశాల్లో కంటే తక్కువ ఖర్చుకు లభిస్తుంది. మరియు భారత్లో నిర్వహింపబడే ఎముక మజ్జ మార్పిడి విజయాల రేటు కూడా ఇతరదేశాలకు దీటుగానే ఉంది.
ఇది ఎందుకు జరుగుతుంది?
వ్యాధి లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి మరియు అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటాయి. ఎముక మజ్జ మార్పిడి కి ముందు వ్యక్తులలో కనిపించే సాధారణ లక్షణాలు:
- బలహీనత
- కుంగుబాటు (డిప్రెషన్)
- నొప్పి
- వికారం
- ఆందోళన
- తగ్గిన నిద్ర
- తగ్గిన ఆకలి
- శ్వాస తీసుకోవడంలో కష్టం
- చేతుల్లో తిమ్మిరెక్కిన (మొద్దుబారిన)భావన
- చర్మం మరియు గోర్లులో మార్పులు
- నోటిలో వాపు లేదా పుళ్ళు
- సులువుగా గాయాలకు లోనవడం
- పునరావృత సంక్రమణలు
- రక్తహీనత
ఇది ఎవరికి అవసరం?
క్రింది వ్యాధి పరిస్థితులు లేదా రుగ్మతలు ఉన్న వ్యక్తులకు ఎముక మజ్జ మార్పిడి (BMT) అవసరం కావచ్చు:
- క్యాన్సర్లు , లుకేమియా , లింఫోమా , మరియు మైలోమా వంటివి .
- అప్లాస్టిక్ రక్తహీనత.
- తలసేమియా వ్యాధి
- సికిల్ సెల్ వ్యాధి (హెమోగ్లోబియాకు దాపురించేది) .
- గట్టి కణితులు.
- రోగనిరోధక వ్యవస్థను బాధించే ఇతర వ్యాధి పరిస్థితులు (రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరంలో రక్షణగా విధి నిర్వర్తిస్తుంది)
ఇది ఎలా జరుగుతుంది?
BMT కి ముందు, మీ డాక్టర్ రక్త కణాల స్థాయిని గుర్తించేందుకు రక్త పరీక్షలను నిర్వహిస్తారు. అంతేకాకుండా, BMT అవసరం ఉందని నిర్ధారించడానికి గుండె పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు మరియు జీవాణుపరీక్ష (ఎముక నుండి కణజాలం తీసుకుని, దాన్లో అసాధారణతల కోసం పరిశీలించబడుతాయి.)లను కూడా చేస్తారు.
ఆరోగ్యవంతుడైన ఎముక మజ్జ దాతకు అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి ఓ సిరంజి సూది ఉపయోగించి ఆ దాత యొక్క ఎముక నుండి మెత్తటి కణజాలం సేకరించబడుతుంది. ప్రసూతి సమయంలో శిశువు బొడ్డు తాడు నుండి సేకరించి భద్రపరచిన మూలకణాల (స్టెమ్ కణాలు)ను భవిష్యత్తులో అదే బిడ్డకు ఆ మూలకణాల్ని ఎముక మజ్జ మార్పిడికి ఉపయోగించవచ్చు. ఆరోగ్యకరమైన దాత ఒక రోజు మాత్రమే ఆస్పత్రిలో ఉండవలసి ఉంటుంది, ఆ తర్వాత డిశ్చార్జ్ అయి, మరో వారం తర్వాత తన మామూలు కార్యనిర్వహణకు బయలుదేరి పోవచ్చు.
BMT కి ముందు, మీ ఎముక మజ్జలో ఉన్న అనారోగ్య కణాలను నాశనం చేయడానికి మీరు కెమోథెరపీ ఔషధాలు మరియు రేడియేషన్తో చికిత్స పొందుతారు. ఇది దాత నుండి కణాల తిరస్కరణను నిరోధించడంలో సహాయపడుతాయి.
BMT శస్త్రచికిత్స ప్రక్రియ కాదు, ఇది రక్తం మార్పిడి మాదిరిగానే ఉంటుంది. మూలకణాలను (స్టెమ్ కణాలను) సిరల్లోకి (నరాల్లోకి) మార్పిడి చేయబడతాయి, అటుపై రక్తప్రసరణ ద్వారా ఈ మూలకణాలు ఎముకకు ప్రయాణించి, రక్త కణాల ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే వృద్ధి కారకాలు కూడా ఇంజెక్ట్ చేయబడతాయి. ఎముక మజ్జ మార్పిడి (BMT) విజయవంతం అయిందా లేదా అని నిర్ధారించడానికి పరీక్షల ద్వారా రక్తం యొక్క క్రమమైన పర్యవేక్షణ చాలా అవసరం.