చర్మ అలెర్జీ అంటే ఏమిటి?
శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ హాని కారకం కాని పదార్థం/వస్తువు కు వ్యతిరేకంగా అసాధారణమైన రీతిలో స్పందించినప్పుడు అలెర్జీ ఏర్పడుతుంది. సాధారణంగా, రోగనిరోధక వ్యవస్థ ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది;అయితే, చర్మపు అలెర్జీ ఉన్న వ్యక్తులు అతిసున్నితమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు. ఎక్జిమా (గజ్జి), దద్దుర్లు, కాంటాక్ట్ డెర్మటైటిస్ (చర్మ వాపు) మరియు ఆంజియోడిమాలు వంటివి సాధారణ చర్మ అలెర్జీ ప్రతిచర్యలు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- చర్మం ఎర్రగా మారుతుంది
- దురద
- వాపు
- దద్దుర్లు
- పైకి ఉబ్బిన బొబ్బలు
- చర్మం యొక్క పొలుసులుగా మారడం
- చర్మ పగులు/చీలిక
ఎక్జిమా మరియు దద్దుర్లు చర్మ అలెర్జీ యొక్క సాధారణ రకాలు మరియు వాటి యొక్క లక్షణాలు రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఎక్జిమా తరచుగా ముఖం మీద ఏర్పడుతుంది దురదతో కూడిన, ఎర్రని లేదా పొడి బారిన చర్మంగా కనిపిస్తుంది, ఇది ద్రవాన్నిస్రవించవచ్చు మరియు గోకినప్పుడు తోలు/తొక్క ఊడిపోవచ్చు. దద్దుర్లు దురదగా, ఎర్రని మరియు తెల్లని బొబ్బల వాలే కనిపిస్తాయి, శరీరంలో ఎక్కడైనా ఏర్పడతాయి మరియు కొన్ని గంటలు లేదా రోజులలో నయం అయ్యిపోతాయి/ తగ్గిపోతాయి. ఆంజియోడిమా (ద్రవం చేరడం వల్ల కలిగే వాపు) ముఖంలో కళ్ళ చుట్టూ, బుగ్గలు లేదా పెదాల మీద ఏర్పడుతుంది. అలాగే చర్మపు దురద మరియు ఎరుపుదనం కలిగించే అలర్జి కారకంతో నేరుగా సంభంధం కలిగి ఉండడం వలన కాంటాక్ట్ డెర్మటైటిస్ సంభవిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అలెర్జీ సాధారణంగా ఈ క్రింది అలర్జిన్ (అలర్జి కారకం) లకు గురికావడం వలన సంభవిస్తుంది:
- రబ్బరు పాలు (Latex)
- పాయిజన్ ఐవీ
- చల్లని మరియు వేడి ఉష్ణోగ్రతలు
- పుప్పొడి
- కాయలు, షెల్ఫిష్ (గుల్ల గల జీవులు) మొదలైన ఆహార పదార్ధాలు
- కీటకాలు
- డ్రగ్స్
- సూర్య కాంతి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యుడు వ్యక్తి యొక్క ఆరోగ్య మరియు కుటుంబ చరిత్రను గురించి అడగవచ్చు మరియు శారీరక పరీక్షను నిర్వహించవచ్చు. వైద్యులు వ్యక్తి యొక్క అలర్జీలను గుర్తించడానికి చర్మ పరీక్ష, ప్యాచ్ పరీక్ష (patch test) లేదా రక్త పరీక్షను కూడా సూచిస్తారు. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి స్కిన్ ప్రిక్ పరీక్ష (Skin prick test) లేదా ఇంట్రాడెర్మల్ పరీక్ష (intradermal test) చేయవచ్చు. ఇంకొక నిర్దిష్టమైన పరీక్ష ఉంది అది ఒక ఫీజిషియన్-సూపర్వైజ్డ్ ఛాలెంజ్ టెస్ట్ (physician-supervised challenge test, వైద్యుని పర్యవేక్షణలో చేసే ఒక సవాలు పరీక్ష) దీనిలో వ్యక్తి నోటి ద్వారా అలెర్జీ కారకాన్ని స్వల్ప పరిమాణం తీసుకోవడం లేదా పీల్చుకోవడం జరుగుతుంది.
అలెర్జీకి చికిత్స రోగి వైద్య చరిత్ర, అలెర్జీ పరీక్ష యొక్క ఫలితం మరియు లక్షణాల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. నేసల్ సెలైన్ రిన్స్ (Nasal saline rinse, ముక్కును సెలైన్ తో శుభ్రం చెయ్యడం) గాలి ద్వారా ఏర్పడిన అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. వైద్యులు అలెర్జీ ప్రతిస్పందన యొక్క తీవ్రతను బట్టి నేసల్ కార్టికోస్టెరాయిడ్స్, మాస్ట్ సెల్ ఇన్హిబిటర్లు (mast cell inhibitors), డీకొంగిస్టెంట్లు (decongestants) మరియు ఎపినెఫ్రిన్ (epinephrine) వంటి కొన్ని మందులను సూచించవచ్చు. ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటిహిస్టామైన్లు మరియు యాంటీబయాటిక్లు మరియు స్టెరాయిడ్లు కలిగిన సమయోచిత క్రీమ్లు కూడా లక్షణాల ఉపశమనం కోసం సూచించబడతాయి.
అయితే, దద్దుర్లను అధికంగా గోకకూడదు అది దురద ఇంకా అధికమయ్యేలా చేస్తుంది. బదులుగా దురద నుండి ఉపశమనం కోసం దద్దరును మృదువుగా ఒక పత్తి వస్త్రంతో రుద్దాలి. వెచ్చని నీటితో స్నానం చెయ్యడం, ప్రభావిత చర్మానికి తేమను అందించడం, బ్లీచ్ (bleach) ను, కఠినమైన డిటర్జెంట్లు లేదా సబ్బులను నివారించడం వంటివి చర్మ అలెర్జీ లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి.