న్యూట్రోపీనియా అంటే ఏమిటి?
న్యూట్రోపీనియా అనేది రక్తంలో న్యూట్రోఫిల్స్ యొక్క స్థాయిలు తక్కువగా ఉండే ఒక పరిస్థితి. న్యూట్రోఫిల్స్ అనేవి ఎముక మజ్జ (బోన్ మేరో) లో ఏర్పడే ఒక రకమైన తెల్ల రక్తకణాలు, ఇవి సూక్ష్మక్రిముల పై పోరాడుతూ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. న్యూట్రోఫిల్స్ యొక్క స్థాయిలు ఒక మైక్రోలీటర్ రక్తంలో 1500 కంటే తక్కువగా ఉంటే, ఆ వ్యకిని న్యూట్రొపీనిక్ అని అంటారు.
న్యూట్రోపీనియాతో బాధపడే వ్యక్తులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
న్యూట్రోపీనియాతో ఏ విధమైన నిర్దిష్ట/ప్రత్యేక లక్షణాలు ముడిపడి ఉండవు. సాధారణంగా ఇది సంక్రమణ/ఇన్ఫెక్షన్ సంభవించినప్పుడు గుర్తించబడుతుంది. అంటువ్యాధుల సమయంలో సాధారణంగా కనిపించే లక్షణాలు:
- అలసట
- తీవ్ర జ్వరం
- చలి
- కడుపు నొప్పి
- విరేచనాలు
- దద్దుర్లు
- దగ్గు, శ్వాస తీసుకోవడంలో కష్టం
- గొంతు మంట
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- బహిరంగ గాయం/పుండు చుట్టూ ఎరుపుదనం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
క్యాన్సర్ చికిత్స న్యూట్రోపెనియా యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి. దీనిలో కీమోథెరపీ (మందులతో), రేడియోథెరపీ (రేడియేషన్ తో) మరియు బయో థెరపీ (జీవుల [organisms] నుండి పొందిన పదార్ధాలతో) వంటివి ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్ కణాలు మరియు సాధారణ కణాలు రెండింటినీ ఈ చికిత్సలు నాశనం చేస్తాయి ఎందుకంటే అవి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేవు. ఇతర కారణాలు:
- బాక్టీరియల్ లేదా వైరల్ సంక్రమణం/ఇన్ఫెక్షన్
- అప్లాస్టిక్ అనీమియా (aplastic anaemia) వంటి ఎముక మజ్జ రుగ్మతలు
- లింఫోమా మరియు లుకేమియా వంటి కణితులు
- ప్లీహము (spleen) పెరగడం
- రుమటోయిడ్ ఆర్థరైటిస్, హైపర్ థైరాయిడిజం మరియు లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
- హైపర్ థైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే మందులు
- విటమిన్ బి 12 లోపం
- హెచ్ఐవి (HIV) సంక్రమణ
- అవయవ మార్పిడి
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రక్తంలోని న్యూట్రోఫిల్స్ స్థాయిలను అంచనా వేసేందుకు వైద్యులు రక్త పరీక్ష సిఫార్సు చేస్తారు. న్యూట్రోపీనియా యొక్క కారణం స్పష్టంగా తెలియనట్లయితే, వైద్యులు ఎముక మజ్జలో ఏవైనా రుగ్మతలు ఉనికిని నిర్ధారించేందుకు ఎముక మజ్జ పరీక్ష (bone marrow test) ను సూచిస్తారు.
న్యూట్రోపీనియా యొక్క చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. సంక్రమణల/ఇన్ఫెక్షన్ల విషయంలో, యాంటీబయాటిక్స్ సూచించబడతాయి. కీమోథెరపీ సమయంలో, న్యూట్రోఫిల్ సంఖ్య సాధారణంగా మొదటి 2 వారాలలో తగ్గుతుంది మరియు తర్వాత 3 నుండి 4 వారాలకు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. సాధారణ స్థాయిలకు చేరడంలో వైఫల్యం ఉంటే కనుక, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఎముక మజ్జను ప్రేరేపించే గ్రోత్ ఫాక్టర్స్ తో మళ్ళీ చికిత్స ప్రారంభించబడుతుంది. ఇది ఖరీదైన చికిత్స, దీనిని అందుబాటులోకి తీసుకురావడం కష్టం అవుతుంది.