ఊపిరితిత్తుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) అంటే ఏమిటి?
ఊపిరితిత్తుల మీద వైరస్లు, ఫంగస్లు లేదా బాక్టీరియలా యొక్క దాడి వలన ఊపిరితిత్తుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) సంభవిస్తాయి. బాక్టీరియా వలన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కంటే వైరస్ వలన ఊపిరితిత్తుల సంక్రమణం/ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా ఉంటుంది. సాధారణంగా కనిపించే ఊపిరితిత్తుల సంక్రమణలు క్షయ వ్యాధి, బ్రోన్కైటిస్, బ్రోన్కియోలైటిస్, ఫ్లూ మరియు న్యుమోనియా.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఊపిరితిత్తుల సంక్రమణలు ఉన్న వ్యక్తులలో ఈ కింది లక్షణాలను గమనించవచ్చు:
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- ఛాతి నొప్పి
- తలనొప్పి
- ఆకలి తగ్గిపోవడం
- జ్వరం మరియు చలి
- కఫంతో కూడిన దగ్గు
- శ్వాసలో గురక శబ్దం
- శరీర నొప్పి మరియు అలసట
- పిల్లలలో ఊపిరితిత్తుల సంక్రమణ ఉన్నపుడు అతిసారం, చిరాకు మరియు వాంతులను గమనించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఊపిరితిత్తుల యొక్క సంక్రమణలు మైకోప్లాస్మా (mycoplasma), ఇది ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా, వైరస్లు లేదా బ్యాక్టీరియాల వలన సంభవిస్తాయి. ఊపిరితిత్తుల సంక్రమణలకు కారణమయ్యే సాధారణ బాక్టీరియా స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా (Streptococcus pneumoniae), స్టెఫైలోకాకస్ ఆరియస్ (Staphylococcus aureus), హీమోఫిలస్ జాతులు (Haemophilus species) మరియు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ (Mycobacterium tuberculosis). ఇన్ఫ్లుఎంజా వైరస్లు (influenza viruses), రెస్పిరేటరీ సిన్సియల్ వైరస్ (respiratory syncytial virus) రెస్పిరేటరీ అడెనోవైరస్లు (respiratory adenoviruses) మరియు పారా ఇన్ఫ్లుఎంజా వైరస్ (parainfluenza viruses) లు ఊపిరితిత్తుల సంక్రమణలకు కారణమయ్యే సాధారణ వైరస్లు. అస్పెర్జీల్లోసిస్ (aspergillosis) వంటి ఫంగస్లు సాధారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి.
బ్యాక్టీరియా మరియు వైరస్లచే సంభవించే ఇన్ఫెక్షన్లు:
- క్షయ వ్యాధి
- న్యుమోనియా
- ఇన్ఫ్లుఎంజా
- బ్రోన్కియోలైటిస్
- బ్రోన్కైటిస్
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఊపిరితిత్తుల సంక్రమణల యొక్క నిర్ధారణకు వైద్యులు ఈ క్రింది పరీక్షలను సిఫారసు చేయవచ్చు:
- సంక్రమణ సమయంలో శరీరం నుండి ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు
- బ్యాక్టీరియా లేదా వైరస్లను గుర్తించడానికి కఫ (Phlegm) పరీక్ష
- ఊపిరితిత్తుల పరిశీలన కోసం ఛాతీ ఎక్స్-రే లేదా సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల యొక్క ఖచ్చితమైన చికిత్స అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. వ్యాధికారక జీవిని తొలగించడానికి వైద్యులు యాంటీబయోటిక్స్ లేదా యాంటీ ఫంగల్స్ వంటి మందులను సూచించవచ్చు. కొన్ని సందర్భాల్లో సంక్రమణను పూర్తిగా తొలగించడానికి శస్త్రచికిత్స లేదా వాష్ (ఊపిరితిత్తులను లోపలి నుండి కడగడం) అవసరమవుతుంది.
ఊపిరితిత్తుల సంక్రమణల నిర్వహణకి ఉపయోగపడే కొన్ని స్వీయ-సంరక్షణ చిట్కాలు:
- ద్రవాలును పుష్కలంగా త్రాగాలి
- వైద్యులు సూచించిన మందులను జాగ్రత్తగా వాడాలి
- శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వలి
- గాలి తేమపరచే పరికరాన్ని (air humidifier) ఉపయోగించవచ్చు లేదా ఆవిరి పీల్చడాన్ని (steam inhalation) ప్రయత్నించవచ్చు
- నిద్రపోతున్నప్పుడు దేనైనా ఆధారం చేసుకుని పాడుకోవాలి అది శ్వాస సులభంగా తీసుకోవటానికి సహాయం చేస్తుంది
- ధూమపానం విడిచిపెట్టాలి అది నేరుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది
- శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నపుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి