గర్భధారణ సమయంలో అజీర్ణం - Indigestion during pregnancy in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 06, 2018

March 06, 2020

గర్భధారణ సమయంలో అజీర్ణం
గర్భధారణ సమయంలో అజీర్ణం

గర్భధారణ సమయంలో అజీర్ణం అంటే ఏమిటి?

అజీర్ణం, గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లక్స్, గర్భధారణ సమయంలో చాలా సాధారణంగా కనిపిస్తాయి, దాదాపుగా మూడింట రెండు వంతులు మహిళలను ప్రభావితం చేస్తాయి. ఇది హార్మోన్ల మార్పుల వలన మరియు శిశువు పరిమాణం పెరుగుతుండడం వలన సంభవించవచ్చు. ఇది గర్భాశయం మీద ఒత్తిడిని పెంచుతుంది అందువలన అది కడుపుకు వ్యతిరేకంగా నెడుతుంది. అజీర్తి/అజీర్ణం వలన తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, కాని లక్షణాలు మళ్లీ మళ్లీ సంభవిస్తూ ఉంటాయి, అధికంగా మరియు అసౌకర్యంగా ఉంటాయి.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గర్భిణీ స్త్రీలు ఆహారం లేదా ద్రవాలు తీసుకున్న తరువాత ప్రత్యేకంగా కొన్ని లక్షణాలను అనుభవిస్తారు

  • రొమ్ము ఎముక చుట్టూ మంట అనుభూతి అది గొంతు వరకు వ్యాపించవచ్చు.
  • ఉబ్బరంగా అనిపించడం
  • త్రేనుపులు
  • యాసిడ్ రిఫ్లక్స్

ఈ లక్షణాలు గర్భం దాల్చినప్పుడు ఏ సమయంలోనైనా జరుగవచ్చు, అయితే సాధారణంగా మూడవ త్రైమాసికంలో గమనించబడతాయి. పెద్ద వయసు స్త్రీలలో మరియు స్త్రీల వారి రెండవ లేదా తరువాతి గర్భధారణ సమయాలలో, త్రైమాసికంతో సంబంధం లేకుండా, ఈ పరిస్థితి చాలా సాధారణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గర్భధారణ సమయంలో అజీర్ణ సమస్య పెరగడానికి  ప్రధాన కారణాలు

  • గర్భాశయ పరిమాణం పెరుగడం వలన అది కడుపు మీద ఒత్తిడిని పెంచుతుంది,ఫలితంగా అన్నవాహిక (ఇసోఫేజియల్) యొక్క కండరం సడలుతుంది, తద్వారా జీర్ణాశయంలోని పదార్దాలు అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తాయి.
  • గర్భధారణ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈస్ట్రోజెన్ సమక్షంలో, ప్రొజెస్టెరాన్ యొక్క అధిక స్థాయిలు సాధారణంగా ఒత్తిడిని కలిగిస్తాయి లేదా కింది అన్నవాహిక (ఇసోఫేజియల్) కండరం యొక్క సడలింపుకు కారణమవుతాయి అది గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్ కు దారితీస్తుంది. అంతేకాకుండా, ప్రొజెస్టెరాన్ కడుపులోని మృదు కండరాల (smooth muscles) పై చర్య చూపి, కడుపు నుండి ఆహారం ఆలస్యంగా బయటకు వెళ్లేలా (తొలగేలా) చేస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

నిర్ధారణ ప్రధానంగా లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం ఉన్న గర్భిణీ స్త్రీలలో వారి శారీరక పరీక్ష మరియు ఆరోగ్య చరిత్రను తెలుసుకున్న తర్వాత జీర్ణాశయ పైభాగం యొక్క ఎండోస్కోపీ (upper gastrointestinal endoscopy) ని ఆదేశిస్తారు.

ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి మరియు అవి వీటిని కలిగి ఉంటాయి

  • రాత్రి భోజనం త్వరగా చెయ్యాలి: అజీర్ణం యొక్క లక్షణాలు రాత్రి సమయాలలో ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. అందువలన, నిద్రపోయే కనీసం రెండు గంటలు ముందు ఆహారం/భోజనం తీసుకోవడం వలన రాత్రి సమయంలో గుండెల్లో మంటని నివారించడానికి సహాయపడుతుంది.
  • భారీ భోజనాన్ని నివారించాలి: అధిక మోతాదులో ఒకేసారి భోజనం చేయకుండా తరుచూ చిన్న చిన్న మోతాదులలో భోజనం చెయ్యాలి.

  • నిటారుగా ఉండాలి: తినేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. ఇది కడుపు మీద ఒత్తిడిని తగ్గించడానికి సహాయం చేస్తుంది.

  • భోజనం చేసేటప్పుడు నీరు(అధికంగా) త్రాగకూడదు: భోజన సమయంలో నీరు త్రాగటం వలన అది గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని (gastric acid) పలుచబరుస్తుంది తద్వారా అజీర్ణ అవకాశాలు పెరుగుతాయి.

  • భోజనం కంగారుగా తినకూడదు: మింగడానికి ముందు ఆహారాన్ని నెమ్మదిగా మరియు పూర్తిగా నమిలి తినాలి అది వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

  • కారంగా ఉన్న ఆహారాలు, మద్యంపానం మరియు ధూమపానం నివారించాలి: ఈ కారకాలు లక్షణాలు మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి.

నివారణ చర్యలు ఉపయోగకరంగా లేనప్పుడు, అజీర్తి/అజీర్ణం యొక్క ఇబ్బంది కొనసాగుతుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడానికి అనేక రకాల మందులు ఉపయోగించబడతాయి

  • కడుపులో యాసిడ్ను న్యూట్రలైజ్ చేయడానికి అంటాసిడ్లు (Antacids).

  • యాసిడ్ రిఫ్లక్స్ వలన కలిగిన అజీర్ణం నుండి ఉపశమనం కోసం ఆల్జినేట్లు (Alginates).

  • గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావం తగ్గించడానికి H2- రిసెప్టర్ బ్లాకర్స్ (H2-receptor blockers).

  • ఆమ్ల ఉత్పత్తిలో పాల్గొనే కడుపు ఎంజైమ్లను నిరోధించడానికి ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్లు (Proton pump inhibitors).



వనరులు

  1. National Health Service [Internet]. UK; Indigestion and heartburn in pregnancy
  2. Vazquez JC. Constipation, haemorrhoids, and heartburn in pregnancy. BMJ Clin Evid. 2010 Aug 3;2010:1411. PMID: 21418682
  3. Office on women's health [internet]: US Department of Health and Human Services; Body changes and discomforts
  4. National Health Service [Internet]. UK; Indigestion and heartburn in pregnancy
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy and diet