అడ్హెసివ్ క్యాప్సూలైటిస్ (ఫ్రోజెన్ షోల్డర్) ఏమిటి?
అడ్హెసివ్ క్యాప్సూలైటిస్ (ఫ్రోజెన్ షోల్డర్) అనేది భుజములలో గట్టిదనం (బిగుతుదనం) వలన నొప్పి లేదా అసౌకర్యం వలన కలిగే ఒక పరిస్థితి. ఇది స్పష్టమైన కారణమంటు లేకుండా భుజం కదలికలను పరిమితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫ్రోజెన్ షోల్డర్ యొక్క ప్రాబల్యం 2% -3% గా ఉంది. ఇది సాధారణంగా 40-70 సంవత్సరాల మధ్య వయస్సులో సంభవిస్తుంది మరియు పురుషులు కంటే స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఫ్రోజెన్ షోల్డర్ మూడు దశలుగా వర్గీకరించబడింది:
- ఫ్రీజింగ్ దశ (Freezing stage)
- ఫ్రోజెన్ దశ (Frozen stage)
- థావింగ్ దశ (Thawing stage)
సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- భుజం యొక్క గట్టిదనం (బిగుతుదనం)
- దీర్ఘకాలిక నొప్పి
- అసౌకర్యం కారణంగా భుజాన్ని కదిలించలేకపోవడం
- రాత్రి సమయంలో భరించలేని నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఫ్రోజెన్ షోల్డర్ యొక్క కారణం ఇంకా తెలియలేదు. సాధారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న వ్యక్తులలో గమనింపబడుతుంది. అధిక లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు, మానసిక వైకల్యం, మరియు గుండె సరిగా పనిచేయని వ్యక్తులలో కూడా దీనిని గమనించవచ్చు. మంచం పట్టిన రోగులలో కూడా ఫ్రోజెన్ షోల్డర్ సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగిని భౌతికంగా పరిశీలించడం అనేది ఈ సమస్య నిర్ధారణలోని ప్రాథమిక దశ. ఇతర సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి ఇమేజింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. సాధారణంగా, ఎక్స్-రేలు మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్లను ఎముకలలో ఏవైనా అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
చికిత్స:
శస్త్రచికిత్సా అవసరం లేని పద్ధతులు:
- NSAIDలు నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మందులు ద్వారా వాపు సమస్యలు నిర్వహించబడతాయి.
- స్టెరాయిడ్లు నొప్పికి మంచి ఉపశమనాన్ని కలిగించగలవు.
- కదలిక శ్రేణిని మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ కూడా అవసరమవుతుంది.
శస్త్రచికిత్సా పద్ధతులు:
- భుజం యొక్కఆర్త్రోస్కోపీ (Shoulder arthroscopy).
- అనస్థీషియా ఇచ్చి భుజాన్ని సరిచేయడం.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- ప్రధాన చికిత్సా విధానం వ్యాయామం మరియు భౌతిక చికిత్స.
- భుజాల మీద ఒత్తిడి తగ్గించడానికి భారీ వస్తువులను ఎత్తకుండా ఉండడం ఉత్తమం.
- లక్షణాల ఉపశమనం కోసం సాధారణ నొప్పి నివారణ చర్యలను ఉపయోగించవచ్చు.
ఫ్రోజెన్ షోల్డర్ సరైన నిర్వహణ మరియు సంరక్షణ అవసరమయ్యే దానికదే నయమయ్యే ఒక సమస్య. క్రమముగా నడవడం మరియు వ్యాయామం వంటివి దీర్ఘకాల నివారణ చర్యలు, అవి భవిష్యత్తులో ఈ సమస్య పురావృత్తని నివారించడంలో సహాయపడతాయి.