ఎందుకు ఛాతీ నొప్పి జరుగుతుంది?
ఛాతీ ప్రాంతంలో ఊపిరితిత్తులు, గుండె, క్లోమం (పాంక్రియాస్), కడుపు, పిత్తాశయం, ఎముకలు, కండరాలు, నరములు మొదలైన అనేక అవయవ నిర్మాణాలు ఉన్నాయి. అందువల్ల ఛాతీ నొప్పి అనేది అంతర్గత పరిస్థితికి సంబంధించింది. పైన పేర్కొన్న అవయవాలకు ఏదైనా హాని, గాయము, సంక్రమణం, వాటిల్లో కణితి (గడ్డ) ఏర్పడినా లేదా ఇతరత్రా ఎలాంటి అసాధారణ మార్పులేర్పడ్డా కూడా ఛాతీనొప్పి రావచ్చు.
గుండె సమస్యలు
“ఆంజినా” అనే పదం ఛాతీలో వచ్చే పిండేసినట్లుండే నొప్పిని లేదా తీవ్ర ఒత్తిడితో కూడిన నొప్పిని నిర్వచించడానికి ఉపయోగించేది. అంతర్లీన గుండె సమస్యల కారణంగానే ఈవిధంగా ఛాతీలో నొప్పి సంభవిస్తుంది. ఆంజినా మరియు గుండెపోటు అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఆంజినా సంభవిస్తే అది గుండె జబ్బు యొక్క సంకేతం, అయితే, గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) అనేది తీవ్రమైన వ్యాధి, దీనికి అత్యవసర చికిత్స చేయకపోతే కూడా ప్రాణాంతకం కావచ్చు అంటే మనిషి వెంటనే చనిపొయ్యే ప్రమాదముంది.
-
వాపు (ఇన్ఫ్లమేషన్)
వాపు పరిస్థితిలో శరీరం యొక్క ఏదైనా భాగం లేదా అవయవం ద్రవంతో చేరి ఊడుకుపోవడం, అలాగే రోగనిరోధక వ్యవస్థ కణాలు లేదా విదేశీ శరీర విషపదార్ధాల కారణంగా వాపులేర్పడ్డం. హృదయాన్ని చుట్టుముట్టి ఉండే తిత్తిలో కూడా వాపు సంభవించవచ్చు. దీన్నే గుండె నంజు లేదా “పెరికార్డిటిస్” అని పిలుస్తారు, ఇది ఛాతీలో పదునైన నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి మెడ లేదా భుజం కండరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
-
అంటురోగం (ఇన్ఫెక్షన్)
కొంతమందిలో, అంటుకొనే బ్యాక్టీరియా క్రిములు గుండె కండరాలకు అంటుకుని అంటువ్యాధికి దారి తీయచ్చు. అటువంటివాటిల్లో ఒకటే ఈ గుండె ‘కండరాల క్రిమిదోష అంటువ్యాధి’ లేదా ‘అక్యూట్ బాక్టీరియల్ ఎండోకార్డిటిస్”. మీరు శ్వాస పీల్చినా, తుమ్మినా లేదా దగ్గినా ఛాతీ నొప్పికి కారణమవుతుంది.
-
ప్రతిష్టంభన (అడ్డంకులు)
రక్తంలో కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిన ఎక్కువగా ఉంటే, గుండెకు రక్తము సరఫరా చేసే హృదయ ధమనుల గోడలపై కొవ్వు పేరుకుపోతుంది. అలా ధమనుల్లో కొవ్వు పెరిగి పెరిగి గుండెకు రక్త సరఫరాను అడ్డుకోవటానికి దారి తీస్తుంది. ఇది “హృద్దామని వ్యాధి’ లేదా “కొరోనరీ ఆర్టరీ” వ్యాధి గా పిలువబడుతుంది. ఈ వ్యాధిలో, ఛాతీ నొప్పి సంభవిస్తుంది. ఎందుకంటే మీ గుండె కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది తద్వారా గుండె నొప్పికి కారణమవుతుంది. ఆ నొప్పి ఛాతీ లో ఒక కష్టతర పరిస్థితిని అంటే ఒత్తిడితో కూడిన సంచలనాన్ని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి మెడ, దవడ, భుజం, లేదా చేతికి కూడా పాకుతుంటూ ఉంటుంది.(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్)
-
హృదయ కండరాలకు హాని
గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోతే, ఇది గుండె కండరాలహానికి దారితీస్తుంది. ఇది జరిగినప్పుడు, ఆంజినా దశలో కలిగే నొప్పికి సమానమైన నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఛాతీకి ఎడమ వైపున గాని సంభవిస్తుంది. ఇది ఆంజినా నొప్పి కంటే తీక్షణంగా ఉండి తీవ్రంగా పిండేస్తున్నట్టు లేదా అది మేస్తున్నట్టు ఉంటుంది.
-
జన్యుపరమైన రుగ్మత
కొన్ని జన్యుపరమైన అవ్యవస్థల్లో గుండె యొక్క ఒక భాగంలో కండరాలు చాలా మందంగా మారవచ్చు. ఇది వ్యాయామం చేసేటపుడు లేదా తీవ్ర శారీరక శ్రమ కల్గిన సమయంలో ఛాతీలో నొప్పికి కారణమౌతుంది. అంటే గాక ఊపిరాడక పోయే పరిస్థితిని కలుగజేస్తుంది. అలా గుండె కండరాల మందం అట్లే పెరుగుతూ పోతే గుండెకు రక్తం సరఫరాలో అంతరాయమేర్పడి గుండె పని చేయటం కష్టం అవుతుంది. ఫలితంగా, తరువాతి దశలలో, మైకము కమ్మడం, అలసట, మూర్ఛ మొదలైనవాటిని ఎదుర్కోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, గుండెపోటు కూడా రావచ్చు.
-
హృదయ నిర్మాణాలు పనిచేయకపోవడం
కొన్నిసార్లు, గుండె యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణాలు సరిగ్గా పని చేయకపోవచ్చు. ఉదాహరణకు, మన గుండెకు ఎగువ మరియు దిగువ గదుల మధ్య రక్తాన్నిసరఫరా చేసే ప్రధాన రక్తనాళాల మధ్య కూడా కవాటాలు ఉన్నాయి. ఈ కవాటాలు రక్తం యొక్క అక్రమ ప్రవాహాన్న నిరోదించి రక్తం ఒక దిశలోనే ప్రవహిస్తుంచేందుకు సహాయ పడతాయి. ద్విపత్ర కవాట భ్రంశం లాగా ఒక కవాటం (వాల్వ్) పనిచేయకపోతే, అది పూర్తిగా మూసివేయదు, రక్తం సరఫరా చేయడానికి గుండె గదిలో తగినంత ఒత్తిడి ఉండదు. ఈ కావాలట భ్రంశం (ప్రోలప్స్) తేలికపాటిదిగా ఉంటే, వ్యాధి ఏ లక్షణాలను చూపించకపోవచ్చు. తీవ్రమైన కేసుల్లో వ్యక్తి ఛాతి నొప్పిని అనుభవిస్తాడు, ఇది ఇతర లక్షణాలైనటువంటి తీవ్ర హృదయ కంపనం, తలతిప్పడం, కళ్ళు తిరగడాలతో ముడిపడి ఉంటుంది.
-
ధమని చినుగు
కొన్ని సందర్భాల్లో, గుండె యొక్క ఒక ధమని (హృదయ ధమని) గోడ చినగొచ్చు. దీన్నే’హృదయ ధమని ఛేదనం’ లేదా “కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్” అని పిలుస్తారు. బృహద్ధమని లేదా అవోర్తా-గుండె నుండి రక్తాన్ని శరీరానికి సరఫరా చేసే ప్రధాన రక్తనాళం. దీన్నే “బృహద్ధమని ఛేదనం” అంటారు. ఇది ఛాతీ కుహరంలో రక్తాన్ని నింపడానికి దారితీస్తుంది. ఈ రక్తస్రావం మరింత ఎక్కువవడంతో ఛాతీలో ఆకస్మికమైన తీవ్రనొప్పి ఏర్పడుతుంది. ఈ నొప్పి మెడ, మీద వెనుక లేదా ఉదరం (ఎముకలు మరియు పొత్తికడుపు మధ్య ప్రాంతం) లోకి కూడా తీక్షణంగా పాకుతుంది.
ఊపిరితిత్తుల సమస్యలు
-
వాపు
మన ఊపిరితిత్తులను కప్పే కండర పొరను ‘ప్లుయెరా’ (pleura) అంటారు ‘ప్లుయెరా’లో ఏదైనా మంట పుట్టిందంటే అది కాస్త “పువురైటిస్’ అని పిలువబడే వాపుకు దారి తీయవచ్చు. ఈ ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పి ఛాతీలో తీక్షణమైన నొప్పికి దారి తీస్తుంది. ఈ ఛాతీ నొప్పి శ్వాసిస్తున్నపుడు, దగ్గుతున్నపుడు లేదా తుమ్ముతున్నపుడు వస్తుంటుంది.
-
ఇన్ఫెక్షన్
కొన్నిసార్లు, మన ఊపిరితిత్తుల బ్యాక్టీరియా లేదా వైరస్ క్రిముల బారిన పడవచ్చు. ఇటువంటి పరిస్థితులలో మీరు ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు, ఇది ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పిని పోలి ఉంటుంది మరియు తుమ్మినపుడు, దగ్గినపుడు లేదా శ్వాసిస్తున్నపుడు ఛాతీలో రావడం జరుగుతుంది. న్యుమోనియాలో, ఛాతీ నొప్పి నిస్తేజంగా (dull) ఉంటుంది. ఈ ఛాతీ నొప్పి జ్వరం, దగ్గు, చలి వంటి ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, దగ్గినప్పుడు శ్లేష్మంతో పాటుగా చీము కూడా వస్తుంది. .
-
రక్తం గడ్డకట్టడం లేదా అడ్డుపడటం
గడ్డకట్టిన రక్తం రక్తప్రవాహంలో ప్రవహించి ఊపిరితిత్తుల వరకు ప్రయాణించవచ్చు మరియు ఊపిరితిత్తులలోనే నిలిచిపోవచ్చు. ఈ రక్తం గడ్డకట్టడం అనేది పువురైటిస్’ లో లాగా కనిపించే తీవ్రమైన, పదునైన నొప్పికి దారి తీస్తుంది మరియు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మరియు శ్వాసిస్తున్నపుడు ఈ నొప్పి వస్తుంటుంది. ఈ ఛాతీ నొప్పి కూడా జ్వరాన్ని కలిగించవచ్చు. తీవ్ర సందర్భాల్లో, వ్యక్తి షాక్ స్థితిని ఎదుర్కొంటాడు. ప్రాణాంతకమైన ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈస్థితిలో తగినంత ప్రాణవాయువు శరీరానికి సరఫరా చేయబడక పోవడంతో వివిధ అవయవాలకు హాని కలగొచ్చు. రక్తం గడ్డ కట్టడం అనేది గడ్డను తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స తర్వాత, లేదా లోతైన సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది.
-
గాయం
ప్రమాదవశాత్తు గాయం లేదా ఛాతీకి అకస్మాత్తుగా దెబ్బ తగిలినప్పుడు, ఛాతీ కుహరంలోకి గాలి చేరుతుంది. ఈ పరిస్థితినే “న్యుమోథొరాక్స్” అంటారు. ఇది ఆకస్మిక మరియు పదునైన నొప్పిని కలిగిస్తుంది, ఈ ఛాతీ నొప్పి తరచుగా తక్కువ రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుంది.
-
అధిక రక్తపోటు
గుండె యొక్క కుడి వైపుభాగం ఊపిరితిత్తుల నుండి రక్తం సరఫరాని పొందుతుంది. అందువల్ల, ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు మూలంగా గుండె కుడి వైపున పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీన్నే ‘పల్మోనరీ హైపర్వెంటిలేషన్’ అంటారు. ఈ పరిస్థితిలో అనుభవించిన ఛాతీ నొప్పి ఆంజినానొప్పికి సమానంగా ఉంటుంది.
-
వ్యాధి లేదా అలెర్జీ
మీరు ఉబ్బసం వంటి వాయుమార్గ వ్యవస్థలో వ్యాధి లేదా అలెర్జీ ఉన్నట్లయితే మీరు ఛాతీ నొప్పిని కూడా అనుభవించవచ్చు. ఈ నొప్పి తరచుగా గుర్రుగుర్రుమని శ్వాసలో శబ్దం చేయడం, శ్వాస తీసుకోలేకపోవడం, ఆస్తమా, గురక మరియు శ్వాసక్రియలో అసౌకర్యం వంటి లక్షణాలని కలిగి ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ యొక్క సమస్యలు
-
పుండ్లు (పూతలు)
కడుపు గోడల పొరల్లో పుళ్ళు గనుక ఉంటే వాటినే ‘కడుపు పూతలు’ అని పిలుస్తారు. ఈ పుండ్ల కారణంగానే ఛాతీ ప్రాంతంలో నొప్పి మరియు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటారు. నొప్పి తరచుగా తీవ్రమైందిగా ఉండి మంటతో కూడుకొని ఉంటుంది.
-
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి
మీ కడుపులోనికి చేరిన ఆహారం తిరిగి అన్నవాహిక లోకి ఆమ్లంతో కలిసి ప్రవహించినట్లైతే తొందర కల్గుతుంది, ఈ తొందరనే “గ్యాస్ట్రోఎసోఫాగియల్ రెఫ్లక్స్” వ్యాధి (GERD) అని పిలుస్తారు. ఇలా కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవేశించినపుడు ఛాతీ దిగువన కేంద్ర ప్రాంతంలో కడుపు నొప్పి, మంట, గుండె మంటను కలుగజేస్థాయి.
-
అన్నవాహిక (ఎసోఫాగస్) సమస్య
అన్నవాహిక (ఎసోఫాగస్) కండరాలలో సమస్య అన్నవాహిక (ఎసోఫాగస్) యొక్క కండరాలు ఏకకాలంలో సంకోచించకపోతే లేదా ఎక్కువగా సంకోచించినా ఛాతీ మధ్యలో నొప్పిని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి సాధారణంగా ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం గొంతులో దిగుతున్నపుడు మంట పుట్టి నొప్పి ఏర్పడుతుంది.
-
వాపు
మీ క్లోమము లేదా పిత్తాశయం వాపు కలిగి ఉంటే, అది చాలా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. క్లోమానికి సంబంధించిన నొప్పి అయితే చాతీకి ఎడమ వైపున నొప్పిస్తుంది. పిత్తాశయానికి సంబంధించినదైతే నొప్పి కుడి వైపున ఉంటుంది. ఇది ఛాతీ మధ్యలో కూడా నొప్పి వస్తుంది మరియు అదే శరీరం యొక్క ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చు. నొప్పి పదునైనదిగాను మరియు తీవ్రమైనదిగాఉంటుంది. ముందుకు వంగడం ద్వారా క్లోమం నొప్పి నుంచి శమనం (రిలీఫ్) పొందవచ్చు. .
-
హైపర్సెన్సిటివిటీ/అతిసున్నితత్వం
కొన్నిసార్లు, అన్నవాహిక (ఎసోఫ్యాగస్) పై ఒత్తిడి లేదా ఆమ్ల (పులుపు) పదార్థాలు తాకిడి కాస్త ఎక్కువైనా అన్నవాహిక అతిసున్నితత్వంతో బాధాకరంగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితినే అన్నవాహిక అతిసున్నితత్వం లేదా ఎసోఫాగియల్ హైపర్సెన్సిటివిటీ అని పిలుస్తారు.
-
అన్నవాహికలో పగుళ్లు
తీవ్రమైన వాంతుల సందర్భాల్లో లేదా ఏదైనా ఆపరేషన్ (శస్త్రచికిత్స) చేయించుకున్న తర్వాత, అన్నవాహిక ఛిద్రం అవచ్చు. అంటే పగలవచ్చు. ఇది ఛాతీ లో ఆకస్మికమైన మరియు పదునైన నొప్పికి కారణమవుతుంది.
-
హెర్నియా (వరిబీజం)
ఆహారం తిన్న తర్వాత పొట్ట తనకు తానుగా ఛాతీ దిగువ ప్రాంతంలోకి నెట్టివేయబడుతుంది. ఈ పరిస్థితిని వివరించడానికే ‘హియాటల్ హెర్నియా’ పదాన్ని ఉపయోగించడమైనది. దీన్నే ‘వరిబీజం దిగబడింది లేదా బుడ్డ దిగింది అంటారు. ఈ పరిస్థితి కారణంగా, ఛాతీలో భారం, నొప్పి, తీవ్ర అసౌకర్యం కలగొచ్చు.
-
ఎపిగ్లోటిటీస్
ఇది చాలా అత్యవసర పరిస్థితి. మీ బేబీ యొక్క శ్వాసనాళికకు అంతరాయం లేదా అడ్డు ఏర్పడడం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో శిశువు శ్వాస పీల్చలేకపోవడం, అధిక జ్వరం, ఛాతీ నొప్పి, చాలా విపరీతంగా గొంతు నొప్పి వంటి లక్షణాలుంటాయి ఈ లక్షణాలన్నీ మింగడంలో కష్టపడటానికి కూడా కారణం కావచ్చు.
అస్థిపంజర కండర (మస్క్యులోస్కెలెటల్) సమస్యలు
అస్థిపంజరం పక్కటెముకలలోని కండరాల్లో బెణుకు సంభవించినా లేదా పక్కటెముకలు విరిగినా ఛాతీ నొప్పి కలుగుతుంది. ఈ రకం నొప్పి పదునైనదిగా, తీవ్రమైనదిగా ఉంటుంది. మరియు నొప్పి గాయం లేదా ఎముక విరిగిన ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. .
ఛాతీ గోడల నొప్పి లేదా ‘కోస్టోకోండ్రిటిస్’ పరిస్థితి ఎలాంటిదంటే ఛాతీ ఎముకలను కలుపుతున్న కణజాలానికి వాపు ఏర్పడినపుడు అది తీవ్ర ఛాతీ నొప్పికి కారణమవుతుంది. ఛాతీ గోడల నొప్పి లేదా కోస్టోకోండ్రిటిస్ అనేది శిశువులలో సంభవిస్తుంది. ఈ నొప్పి పొడి దగ్గుతో కలిపి వస్తూ ఉంటుంది.
నరాల సమస్యలు
ఛాతీలోని నరాలకు గాయం లేదా అంటువ్యాధి సోకినపుడు వెన్నెముక ప్రాంతంలో గాని, రొమ్ము లేదా ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్) ఏర్పడి ఛాతీలో నొప్పి రావడం సాధారణం. . ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్గు) విషయంలో వరిసెల్లా-జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమణం కారణంగా నరాలతో సంభవిస్తుంది. ఇది ఛాతీ, భుజం, మరియు వెనక భాగంలో తీవ్ర నొప్పిని కలిగిస్తుంది. తరచుగా నరాల పక్కన ప్రాంతంలో ఈ దద్దుర్లు (rashes) ఏర్పడుతుంటాయి.
ప్రమాద కారకాలు
క్రిందిచ్చిన కొన్ని కారకాలు ఛాతీ నొప్పికి లోనయ్యేలా చేస్తాయి.
- ధూమపానం.
- అధిక సురాపానం (సారాయి/ఆల్కహాల్ తీసుకోవడం).
- ఊబకాయం (అధిక బరువు)
- రోగనిరోధక వ్యవస్థలో లోపాలు కారణంగా అంటురోగాల భారిన పడేలా చేస్తుంది.
- రక్తంలోని సిరలలో ఉండే అధిక కొవ్వు (కొలెస్ట్రాల్) కారణంగా హృదయ ధమని నిరోధకత (coronary artery blockage) ప్రమాదాన్ని పెంచుతుంది.
- అధిక రక్తపోటు మన గుండె మీద మరింత శ్రమను పెంచుతుంది.
- శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం లేక శారీరక శ్రమ తగినంత లేకపోవడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ లేకపోవడం అనేది మొత్తం శరీరానికే ప్రతికూల ప్రభావం కలుగజేస్తుంది.
- అనారోగ్యకరమైన చిరు తిండ్లు (‘జంక్ ఫుడ్’) తినడం మూలాన గుండె సమస్యలు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలుగజేస్తాయి.