సారాంశం
అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటును కల్గి ఉండడం అన్నది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. రక్తపోటు స్థాయిలలో తగ్గుదల సంభవించినపుడు, కొన్నిసార్లు, అది మీకు ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. (దీన్నే ‘హైపోటెన్షన్’ అని కూడా పిలుస్తారు.). రక్తపోటు అనేది, గుండె సంకోచించినపుడు (సిస్టోల్) మరియు హృదయస్ఫురణం (డయాస్టోల్) సమయంలో రక్తనాళాల గోడలపై ఒత్తిడి కల్గుతుంది. బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ రెండు సంఖ్యలను ఉపయోగించి సూచించబడతాయి. ఆరోగ్యవంతమైన వారి సాధారణ బీపీ 120/80 గా ఉంటుంది, ఈ రక్త పోటు ఒత్తిడి రీడింగులు 90/60 mm Hg లేదా అంత కంటే తక్కువ ఉంటే, అది అల్పరక్తపోటు లేదా ‘లో బీపీ’ గా పరిగణించబడుతుంది. కొంతమందికి అల్ప రక్తపోటు సాధారణం కావచ్చు కానీ మరికొందరిలో ఇది గుర్తించబడవచ్చు, అంతేకాక అనారోగ్యం, మూర్ఛ లేదా తేలికపాటి తలనొప్పి వంటి లక్షణాలు కానవస్తాయి. సాధారణంగా, గాయం అయినపుడు, రక్తాన్ని కోల్పోవడం జరిగినపుడు, శరీరంలోనికి తీసుకోవాల్సిన ద్రవాలు తక్కువైనపుడు లేదా కొన్ని నిర్దిష్ట ఔషధాల సేవనం కారణంగా రక్త పీడన స్థాయి పడిపోవడం అనేది దాపురిస్తుంది. అల్ప రక్తపోటు (లో బీపీ) యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించి, అందుకు గల అంతర్లీన కారణం తెల్సుకుని ఖచ్చితమైన చికిత్సను వెంటనే పొందడం మంచిది. అల్ప రక్తపోటు యొక్క చికిత్సలో ప్రధానంగా ఉప్పు-చక్కెర ద్రావణాన్ని లేదా ఇతర ద్రవాలను రోగిచేత ఎక్కువగా సేవింపజేయడం జరుగుతుంది. అల్ప రక్తపోటును కలిగించే అంతర్లీన సమస్య ఉంటే, దానికి తగిన చికిత్స చేయడం వల్ల రక్తపోటును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుంది.