టులారేమియా అంటే ఏమిటి?
టులారేమియా ఒక బాక్టీరియా సంక్రమణను సూచిస్తుంది, ఇది సంక్రమిత జంతువు నుండి మానవులకి వ్యాపిస్తుంది. ఇది ఒక అరుదైన వ్యాధి, ఐతే నివేదించబడిన కేసులు ఎక్కువగా ఉత్తర అమెరికా మరియు ఐరోపా మరియు ఆసియా ప్రాంతాల నుండి ఉన్నాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టులారేమియా యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- జ్వరం
- చెమటలు
- కంటిలో చికాకు
- తలనొప్పి
- కండరాల నొప్పి
- కీళ్ళ నొప్పి
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- బరువు నష్టం
- చర్మంపై ఎరుపు మచ్చలు ఏర్పడతాయి, అవి పుళ్ళగా అభివృద్ధి చెందుతాయి
- చర్మంపై పుండ్లు
- నోటి పూతలు
- మెడలో శోషరస కణుపుల (లింఫ్ నోడ్ల) వాపు
బాక్టీరియాకు బహిర్గతం అయిన (బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన) 3-5 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- టులారేమియా యొక్క ప్రాధిమిక కారణం ఫ్రాన్సిసెల్లా టులారెనిసిస్ (Francisella tularensis) అని పిలువబడే బాక్టీరియా. ఈ బాక్టీరియా సాధారణంగా అడవి ఎలుకలలో ఉంటుంది.
- వ్యాధి సోకిన జంతువు లేదా పురుగులు, దోమలు మరియు జోరీగలు వంటివి కుట్టడం ద్వారా మానవులకు ఈ సంక్రమణ సోకుతుంది.
- ఈ బ్యాక్టీరియా ఉన్న దుమ్మును (దూళిని) శ్వాసించడం కూడా సంక్రమణకు కారణం కావచ్చు.
- సంక్రమిత జంతువులతో ప్రత్యక్ష సంబంధం కలిగివున్నా లేదా దాని మృతదేహాన్ని పట్టుకున్నా కూడా ఈ సంక్రమణ వ్యాపిస్తుంది.
- సరిగ్గా వండని/ఉడకని మరియు సంక్రమిత మాంసాన్ని తినడం వల్ల కూడా సంక్రమణ వ్యాప్తి చెందుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఇతర సాధారణ వ్యాధుల లక్షణాలతో టులారేమియా వ్యాధి లక్షణాల పోలి ఉండడం వల్ల, టులారేమియా వ్యాధి నిర్ధారణ కష్టం. అయినప్పటికీ, రక్త పరీక్షలు మరియు ఛాతీ ఎక్స్-రే సహాయంతో టులారేమియాను ప్రత్యేకంగా నిర్దారణ చేయవచ్చు. రోగి ఎలుకలతో వ్యవహరించిన చరిత్రను గురించి తెలుసుకోవడం మరియు శారీరక పరీక్షలు కూడా రోగనిర్ధారణకు సహాయపడతాయి.
రోగనిర్ధారణ ధృవీకరించబడితే, వైద్యులు చికిత్స కోసం యాంటీబయాటిక్స్ ను సిఫారసు చేస్తారు. టులారేమియా చికిత్స కోసం ఎక్కువగా ఉపయోగించే యాంటీబయాటిక్స్:
- స్ట్రెప్టోమైసిన్ (Streptomycin)
- జంటామైసిన్ (gentamicin)
- సిప్రోఫ్లోక్సాసిన్ (Ciprofloxacin)
లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స 3 వారాల వరకు ఉండవచ్చు.
జంతువులతో వ్యవహరించే మరియు మట్టిని తాకే సమయంలో చేతికి గ్లౌజులు ధరించడం, బాగా వండిన మాంసం తినడం ద్వారా టులారేమియాను నివారించవచ్చు.
టులారేమియాకు చికిత్స చేయవచ్చు కాని సరైన నిర్ధారణ చేయకపోతే, న్యుమోనియా మరియు ఎముక సంక్రమణలు వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చు.