శయ్య పుళ్ళు (బెడ్ సోర్స్) అంటే ఏమిటి?
దీర్ఘ కాలంపాటు నిరంతరమైన ఒత్తిడి కారణంగా ఎముక భాగాలలో చర్మం మరియు కణజాలం మీద శయ్య పుళ్ళు లేదా ఒత్తిడి పుళ్ళు ఏర్పడతాయి. నిరంతరంగా ఒకే స్థితిలో కూర్చోవడం లేదా పడుకోవడం వలన రక్త ప్రసరణలో తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చాలా వరకు శయ్య కురుపులు 70 ఏళ్ళు పై బడిన పెద్దవారిలో నివేదించబడ్డాయి.
ఒక భారతీయ అధ్యయనంలో ఆసుపత్రిలో చేరిన రోగులలో ఈ బెడ్ సోర్స్ 4.94%గా ఉన్నాయని తెలిసింది. చర్మానికి జరిగే తీవ్ర నష్టాన్ని నివారించడానికి ప్రారంభంలోనే చికిత్స చేయడం అవసరం.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రారంభ దశలలో, శరీరంలో (ఒకే స్థితిలో కూర్చుని లేదా పడుకుని ఉన్నపుడు) నిరంతర ఒత్తిడి ఉండే భాగాలలోని ఉదాహరణకు, మంచంపట్టిన రోగుల పిరుదులు మరియు భుజాల చర్మం మీద మెరిసే, ఎరుపు రంగు మచ్చలను గుర్తించవచ్చు. ఇది క్రమంగా చర్మం పై పొర నష్టానికి (ఎపిడెర్మిస్) దారితీస్తుంది మరియు పుండును అభివృద్ధి చేయవచ్చు.
ఎముక క్రింద కణజాలంలో ఒత్తిడి ఉన్నప్పుడు, చర్మం మీద వాపు మరియు సంచలనాలు(sensations) తగ్గిపోవడాన్ని అనుభవించవచ్చు. చివరికి, అది ఆ ప్రాంతంలో సంక్రమణ/ఇన్ఫెక్షన్ మరియు కణజాల నష్టానికి దారితీస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
భుజం వెనుక వైపు, టెయిల్ బోన్, పిరుదులు మరియు మడమల వంటి భాగాల మీద అధిక మరియు దీర్ఘకాలిక ఒత్తిడి ఏర్పడినప్పుడు బెడ్ సోర్స్ అభివృద్ధి చెందుతాయి.
ఏర్పడిన ఒత్తిడి రక్త నాళాలను అణిచివేస్తుంది (compresses) అవి చర్మానికి ఆక్సిజన్ మరియు పోషకాల సరఫరాను తగ్గిస్తాయి. సుదీర్ఘకాలం పాటు పోషకాలు మరియు ఆక్సిజన్ లేకపోవటం అనేది పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.
బెడ్ సోర్స్ అభివృద్ధి చెందడానికి ఇతర కారణాలు:
- చర్మం మరియు లోపలి కణజాలం యొక్క కదలిక వ్యతిరేక దిశ ఉండడం
- రాపిడి వలన గాయం
- వెన్నెముకకు గాయం
- బ్యాక్టీరియా పెరుగుదలను మరియు పుండు ఏర్పడడాన్ని ప్రేరేపించే తేమ
- దేహ్యాడ్రేషన్ (నిర్జలీకరణం), పోషణ లేకపోవడం, మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఊబకాయం (పిల్లలలో) వంటి పరిస్థితులు
- కదలిక లేకపోవడం (ఉదా. పక్షవాతం, శస్త్రచికిత్స తర్వాత)
- ఫ్రాక్చర్లో బద్దకట్టు (Cast) ఉపయోగం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తి (లేదా అతని యొక్క సంరక్షకుడు కానీ) తన శరీరం మీద ఒక బెడ్ సోర్ను గుర్తించినట్లయితే, వెంటనే వైద్యునికి తెలియజేయాలి. ముందుగా పుండును పూర్తిగా శుభ్రం చెయ్యాలి మరియు దానికి కట్టు కట్టాలి (డ్రెస్సింగ్) మరియు ఏర్పడిన బెడ్ సోర్ మీద ఒత్తిడిని తగ్గించడానికి రోగి యొక్క స్థానాన్ని మార్చాలి. సంక్రమణ/ఇన్ఫెక్షన్ విషయంలో సమయోచిత యాంటీబయాటిక్స్ క్రీములు సలహా ఇవ్వబడతాయి. పుళ్ళ తీవ్రతను బట్టి చికిత్స సమయం 2 నుండి 4 వారాల వరకు ఉంటుంది.
శయ్య పుళ్ళు ఏర్పడకుండా వ్యక్తి తనను తాను ఈ క్రింది విధంగా సంరక్షించుకోవచ్చు:
- వీల్ చైర్ మీద ఉన్నప్పుడు వారి బరువును (స్థానాన్ని) క్రమంగా మారుస్తూ ఉండాలి
- మంచం మీద పడుకుని ఉన్న సమయంలో వారి స్థానాన్ని మారుస్తూ ఉండాలి
- రాపిడి గాయాలను నివారించడానికి నిరంతరంగా చర్మాన్ని దుప్పటి మీద ఉంచకూడదు
- మంచం మీద ఉన్న రోగుల చర్మాన్ని క్రమంగా పరిశీలిస్తూ ఉండాలి
- శుభ్రపరచే ఎజెంట్ల తో చర్మాన్ని శుభ్రపరుస్తూ ఉండాలి
- చర్మాన్ని పొడిగా ఉంచాలి
- కావలసినంత నీరు మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి