గర్భధారణ సమయంలో మనస్థితి మార్పులు (మూడ్ స్వింగ్స్) అంటే ఏమిటి?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె జీవితంలో అలాగే ఆమె శరీరంలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఉదయపు నీరసం, మలబద్ధకం, ఆహార కోరికలు, దురద, నడుము నొప్పి, యోని థ్రష్ (ఈస్ట్ ఇన్ఫెక్షన్), తలనొప్పి, కాళ్ళ తిమ్మిరి, వాపు మొదలైన జీవ సంబంధిత (biological) మార్పులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని మార్పులు చాలా అసౌకర్యంగా ఉంటాయి వాటిని నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది మరియు అవి మనస్థితి మార్పుల (మూడ్ స్వింగ్స్) కు దారితీస్తాయి. ప్రతి గర్భిణీ స్త్రీ సాధారణంగా గర్భధారణ సమయంలో మనస్థితి మార్పులను (మూడ్ స్వింగ్స్) ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు, ఈ మూడ్ స్వింగ్స్ ఆందోళన మరియు కొన్నిసార్లు కుంగుబాటుకి దారితీస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె ఇలాంటి మనస్థితి మార్పులను ఎదుర్కోవచ్చు:
- గర్భం దాల్చడం గురించి ఉండే ఆకస్మిక ఉత్సాహం.
- ఒత్తిడి.
- ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం.
- తల్లిగా బిడ్డ జననం గురించి కంగారుగా ఉండడం.
- ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా విచారంగా ఉండడం.
కొన్నిసార్లు, ఈ లక్షణాలు చాలా తీవ్రంగా మారతాయి మరియు వాటికి వెంటనే తగిన నిర్వహణ అవసరమవుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కింది కారణాలు గర్భాధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ కు దారితీయవచ్చు:
- హార్మోన్ల మార్పులు
- జీవక్రియ (Metabolic) మార్పులు
- అలసట
- శారీరక ఒత్తిడి
గర్భిణీ స్త్రీలలో మానసిక స్థితి మార్పుల కారణాలలో కుంగుబాటు మరియు ఆందోళన కూడా ఉంటాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ సాధారణం మరియు ఏటువంటి నిర్ధారణ అవసరం ఉండదు. ఒక వేళా ఈ మనస్థితి మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే లేదా ఆమెకు క్రింది లక్షణాలలో ఏవైనా ఉంటే వెంటనే వైద్యులని లేదా గైనకాలజిస్ట్ను సంప్రదించాలి:
- నిద్రలో ఆటంకాలు
- స్వల్పకాలిక జ్ఞాపక శక్తి తగ్గుదల.
- ఆందోళన.
- చాలా విసుగుగా అనిపించడం.
- ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం.
- ఎక్కువ సమయం పాటు ఏదైనా పని మీద దృష్టి కేంద్రీకరించడంలో సమస్య.
ఈ సంకేతాలు గర్భధారణ సంబంధిత కుంగుబాటు యొక్క ఉనికిని కూడా సూచిస్తాయి. సాధారణ వైద్యులు (general physician) చికిత్స కోసం నిర్దిష్ట మందులను సూచిస్తారు లేదా వారు కౌన్సెలింగ్ కోసం ఎవరైనా సైకోలాజిస్ట్ను కూడా సూచించవచ్చు. ఇతర నిర్వహణ పద్ధతులు:
- గర్భధారణ యోగ (Pregnancy yoga) లేదా ధ్యానం..
- క్రమమైన శారీరక శ్రమ (physical activity).
- సానుకూలంగా ఆలోచించడం మరియు సానుకూల వాతావరణంలో ఉండడం.
- కొంచెం సమయం బయటి గాలిలో నడవడం.
- స్నేహితులు మరియు కుటుంబంతో ఒక సినిమాలు చూడడం.
- విరామం తీసుకొని విశ్రాంతిగా ఉండడం.
- మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం.
- మర్దన (మసాజ్).