కుష్టురోగం (లెప్రసీ) అంటే ఏమిటి?
కుష్టురోగం (లెప్రసీ) లేదా హాన్సెన్స్ వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) అనే బాక్టీరియా వలన సంభవించే చర్మ మరియు నరాల సంక్రమణ/అంటువ్యాధి. ఈ సమస్య చర్మం, శ్లేష్మ పొరలు (mucous membranes), పెరిఫెరల్ నరములు, కళ్ళు మరియు శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం , కుష్టు వ్యాధికి గురైన వ్యక్తికి దగ్గరిగా ఉండడం వలన ఈ వ్యాధి సంభవిస్తుందన్న ఉన్న నమ్మకంతో పాటుగా, శ్వాసకోశ మార్గం ద్వారా మరియు కీటకాలు ద్వారా కూడా కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది.
చర్మ స్మియర్ల (skin smear) ఆధారంగా ఈ సమస్య వర్గీకరించబడింది:
- పాసిబాసిల్లరీ లెప్రసీ (PB, Paucibacillary leprosy) - నెగటివ్ స్మియర్లు
- మల్టిబాసిల్లరీ లెప్రసీ (MB, Multibacillary leprosy) - పాజిటివ్ స్మియర్లు
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ సమస్య పైకి కనిపించే లక్షణాలను కలిగి ఉంటుంది, తద్వారా సులభంగా గుర్తించడానికి వీలుపడుతుంది:
- చర్మం మీద కందిన/రంగు మారిన మచ్చలు, సాధారణంగా ఫ్లాట్ గా ఉంటాయి
- చుట్టుప్రక్కల ప్రాంతాల కంటే తేలికగా ఉండే తిమ్మిరితో కూడిన మరియు క్షీణించిన/వాడిపోయిన గాయాలు
- చర్మంపై బొడిపెలు
- పొడి బారిన మరియు గట్టిబడిన చర్మం
- అరికాళ్ళలో పుండ్లు
- ముఖం లేదా చెవులు మీద గడ్డలు
- కనురెప్ప వెంట్రుకలు మరియు కనుబొమ్మల పూర్తిగా లేదా పాక్షికంగా దబ్బతినడం
ఇతర లక్షణాలు:
- ప్రభావిత ప్రాంతంలో చెమట పట్టకపోవడం మరియు తిమ్మిరి
- పక్షవాతం
- కండరాల బలహీనత
- ప్రత్యేకించి మోచేతులు మరియు మోకాళ్ళ చుట్టూ ఉన్న నరములలో వాపు
- ముఖ నరాల పై దీని ప్రభావం అంధత్వానికి దారితీయవచ్చు
ఆఖరి దశల్లో, వీటికి దారి తీయవచ్చు:
- పాదములు మరియు చేతులు కుంటిగా మారుట (పనిచేయక పోవుట)
- చేతి వేళ్లు మరియు కాలి వేళ్ళు చిన్నగా అవుట
- పాదం మీద పుండ్లు తగ్గకపోవుట
- ముక్కు ఆకృతి మారిపోవుట
- చర్మం మీద మంట అనుభూతి
- బాధాకరమైన లేదా సున్నితమైన (తాకితేనే నొప్పి పుట్టే) నరములు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మన వాతావరణంలో సామాన్యంగా కనిపించే మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. జీన్ మ్యుటేషన్లు (జన్యు మార్పులు) మరియు వైవిధ్యాలు (variations) లెప్రసీ సంభవించే అవకాశాన్ని పెంచుతాయి. అదేవిధంగా, రోగనిరోధక వ్యవస్థలో మార్పులు మరియు వాపు కూడా సంభావ్యత అవకాశాన్ని పెంచుతాయి. వ్యాధి సోకిన వ్యక్తికి దీర్ఘకాలం పాటు దగ్గరగా ఉండడం లేదా బ్యాక్టీరియా ఉన్న నాసికా బిందులతో (nasal droplets, ముక్కు నుండి కారిన శ్లేష్మ బిందువులు) కలుషితమైన గాలి పీల్చుకోవడం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చర్మం అసలు రంగు కంటే ముదురు లేదా లేత రంగులో ఉండే చర్మపు మచ్చల ద్వారా కుష్టు వ్యాధి గుర్తించబడుతుంది. మచ్చలు ఎర్రగా కూడా కనిపిస్తాయి. పరిశీలనను నిర్ధారించడానికి, వైద్యులు చర్మ లేదా నరాల జీవాణుపరీక్ష (బయాప్సీ) ను నిర్వహించవచ్చు.
ఈ సమస్యను వివిధ యాంటీబయాటిక్స్ యొక్క కలయికతో చికిత్స చేయవచ్చు. యాంటీబయాటిక్ నిరోధకత (resistance) ను నివారించడానికి ఈ మల్టీ-డ్రగ్ (multi-drug) చికిత్స ముఖ్యమైనది. వీటిలో డాప్సోన్ (dapsone), క్లోఫాజైమిన్ (clofazimine) మరియు రిఫాంపసిన్ (rifampicin) ఉంటాయి. ఈ మందులకు అలెర్జీ ఉన్న సందర్భంలో, మినోసైక్లిన్ (minocycline), క్లారిథ్రోమైసిన్ (clarithromycin) మరియు ఆఫ్లాక్సాసిన్ (ofloxacin) వంటివి ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలు.
తిమ్మిరిని ఎదుర్కోవడానికి, పాదాలను రక్షించే మరియు సాధారణ నడకను పునరుద్ధరించడానికి సహాయపడే ప్రత్యేక బూట్లను ఎంచుకోవాలి. పైకి కనిపించే వైకల్యాలను సరిచేయడానికి మరియు స్వీయ విశ్వాసాన్ని (self-confidence) మెరుగుపరచడానికి సర్జరీ సహాయపడుతుంది.
మొత్తంమీద, ఈ సమస్యను ఒక సంవత్సర కాలంలో చికిత్స చేయవచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన మరియు సకాల చికిత్స వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు.