రక్తంలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరగడం అంటే ఏమిటి?
ఎముకలు మరియు దంతాలకు ఫాస్ఫరస్ ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం (micronutrient). ఫాస్ఫేట్ స్థాయిలు పెరగడం అనేది ప్రమాదకరం మరియు దానికి తక్షణ చికిత్స అవసరం. రక్తంలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరగడాన్ని హైపర్ ఫాస్ఫేటేమియా (hyperphosphatemia) అని పిలుస్తారు. ఇది మూత్రపిండాల మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హైపర్ ఫాస్ఫేటేమియా దాని సొంతంగా ఏ విధమైన లక్షణాలను చూపదు. కనిపించే లక్షణాలు అంతర్లీన వ్యాధికి సంబంధించినవి కావచ్చు.
- అధిక ఫాస్ఫేట్ స్థాయిలు తరచుగా రక్తంలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తాయి, దీని వలన ఎముకలు బలహీనమవుతాయి.
- రక్తంలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరిగిన వారిలో కండరాల సంకోచాలు (బిగుతుగా మారడం) సాధారణ కనిపిస్తాయి.
- వ్యక్తి యొక్క చర్మం పొడిగా, దురదగా, మరియు పొలుసులుగా మారవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, అవి శరీరం నుండి అదనపు ఫాస్ఫేట్లను తొలగించలేవు, ఫలితంగా రక్తంలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరుగుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండ వైఫల్యం వంటి మూత్రపిండాల వ్యాధులు అధిక సీరం ఫాస్ఫేట్ స్థాయిలను కలిగిస్తాయి.
- కొన్నిసార్లు, పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క తక్కువ స్థాయిలు కూడా అధిక సీరం ఫాస్ఫేట్ స్థాయిలను కలిగిస్తాయి.
- అదేవిధంగా, తక్కువ కాల్షియం స్థాయిలు కూడా ఫాస్ఫేట్ స్థాయిలను పెంచుతాయి.
- మధుమేహం లేదా కీటోయాసిడోసిస్ వంటి ఎండోక్రైన్ సమస్యలు (Endocrine conditions) కూడా శరీరంలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఒక వ్యక్తికి హైపర్ ఫాస్ఫేటేమియా లక్షణాలు ఉన్నట్లయితే, వైద్యులు ముందుగా భౌతిక పరీక్ష నిర్వహిస్తారు మరియు పూర్తిస్థాయి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు తర్వాత అంతర్లీన కారణాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుతారు.
- రక్త పరీక్ష, ఇది రక్తంలోని అధిక ఫాస్ఫేట్ స్థాయిలు గురించి తెలిపే ప్రాధమిక పరీక్ష. అధిక చక్కెర లేదా అసాధారణ కాల్షియం మెటాబోలిజం (జీవక్రియ) గురించి కూడా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
- ఎముకలకు ఏదైనా నష్టం సంభవించినట్లు అనుమానించినట్లైతే, ఎక్స్-రే కూడా నిర్వహించబడుతుంది.
ఈ పరిస్థితి యొక్క చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు క్రింది చికిత్సా విధానాలను కలిగి ఉండవచ్చు:
- మూత్రపిండాల రుగ్మతలకు ఆహార నియంత్రణ ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో, మందులతో పాటు డయాలసిస్ (dialysis) కూడా అవసరం కావచ్చు.
- మధుమేహం కనుక అంతర్లీన కారణం అయితే, ఇన్సులిన్ సిఫారసు చేయబడుతుంది.
- కాల్షియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే కాల్షియం సప్లిమెంట్లను సూచిస్తారు. కాల్షియం బైండర్లు అనే ఒకరకమైన మందులను ఈ సమస్యకు ఉపయోగపడతాయి.
- ఈ సమస్య యొక్క అంతర్లీన కారణంతో సంబంధం లేకుండా మాంసం, పౌల్ట్రీ , చేపలు, గింజలు వంటి ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మానివేయడం సమస్య నిర్వహణకు ముఖ్యమైనది.