మడమ ఎముక పెరగడం (హీల్ స్పర్) అంటే ఏమిటి?
మడమ ఎముక పెరగడం (హీల్ స్పర్) అనేది ఒక అసాధారణ ఎముక పెరుగుదల దాని ఫలితంగా నడుస్తున్నపుడు, నుల్చున్నపుడు లేదా పరిగెడుతున్నపుడు నొప్పి సంభవిస్తుంది. ఒత్తిడి నుండి మడమలను రక్షించే స్నాయువులు(tendons) లేదా నరములు మరియు కండరములకు గాయం లేదా హాని కలగడం వలన మడమలలో కాల్షియం పేరుకుపోయి ( అధికంగా చేరి) ఫలితంగా ఈ ఎముక పెరుగుదల అభివృద్ధి చెందుతుంది.
ఇది సాధారణంగా పిల్లలు కంటే ఎక్కువ మధ్య వయస్కులైన పెద్దలలో కనిపిస్తుంది. ఇది పురుషులను మరియు మహిళలను సమానంగా ప్రభావితం చేస్తుంది. ఒక భారతీయ అధ్యయనం ప్రకారం, మడమ నొప్పి ఉన్న వారిలో హీల్ స్పర్ యొక్క సంభావ్యత 59%గా ఉన్నట్లు గుర్తించబడింది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రాధమిక లక్షణం మడమ నొప్పి. కానీ చాలా అరుదుగా కొన్ని హీల్ స్పర్లు వాటికవే నొప్పిని కలిగిస్తాయి, సమీపంలో చుట్టూ ఉండే కణజాలం పై ఈ ఎముక పెరుగుదల యొక్క ఒత్తిడి కారణంగా బాధను/నొప్పిని అనుభవించవచ్చు. ఉదయం నిద్ర లేవగానే మంచం నుండి దిగి నడిచే సమయంలో పదునైన సలిపే నొప్పి కలుగుతుంది, ఇది తర్వాత క్రమంగా తగ్గుతుంది. మడమ మీద వాపు మరియు సున్నితత్వం (తాకితేనే నొప్పి పుట్టడం) కూడా ఉండవచ్చు.
లక్షణాలు ప్లాంటార్ ఫస్సియిటిస్ (plantar fasciitis) వలె ఉంటాయి, ప్లాంటార్ ఫస్సియిటిస్ అంటే కనెక్టీవ్ టిస్యూ యొక్క వాపు లేదా గాయం, ఇది మడమ నుండి కాళ్ళ వేళ్ళ వరకు వ్యాపిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో హీల్ స్పర్ కు ప్రధాన కారణం ప్లాంటార్ ఫస్సియిటిస్. ప్లాంటార్ ఫేస్సీయ (అరికాలి కండరాల చుట్టూ ఉండే పొర) కు గాయం కలిగినప్పుడు, అది ఒత్తిడి నుండి పాదమును రక్షించే కణజాలం, నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దాని వలన చిన్న ఎముక వంటిది పెరగడం మొదలవుతుంది. మడమ ఎముక పెరగడం (హీల్ స్పర్) యొక్క ఇతర కారణాలు:
- పాదముల కండరాలు మరియు నరముల మీద అధిక ఒత్తిడి
- పాదం అధికంగా సాగదీయడం (overstretching)
- అథ్లెట్లలో శారీరక కార్యకలాపాలు, పరుగుపెట్టడం మరియు ఎగరడం (జంపింగ్)వంటివి
- ఎక్కువ సమయం నిలబడి ఉండడం
- మడమలు చదరంగా ఉన్న లేదా అధిక వంపుతో ఉన్న వ్యక్తులు
- నిలకడగా నడవకపోవడం
- పాదానికి సరిపడని బూట్లు ధరించడం
- అధిక బరువు
- గర్భం
- ఆర్థరైటిస్ మరియు మధుమేహం వంటి వ్యాధులు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తికీ హీల్ స్పర్ యొక్క లక్షణాలు ఉంటే, వైద్యులు ముందుగా పాదములను పరిశీలించి మరియు కారణాన్ని గుర్తించడానికి ఆరోగ్య చరిత్ర తెలుసుకుంటారు. అప్పుడు ఎక్స్-రే సిఫార్సు చేయబడుతుంది. అయితే, ఎంఆర్ఐ (MRI) మరియు అల్ట్రాసౌండ్లు వంటి పరీక్షలు అరుదుగా సిఫార్సు చేయబడతాయి.
వాపు నిరోధక (anti-inflammatory) మందులు వంటి మందులు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి సూచించబడతాయి. హీల్ స్పర్ యొక్క నొప్పి నిర్వహణలో ఇతర స్వీయ సంరక్షణ పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- తగినంత విశ్రాంతి తీసుకోవడం
- నొప్పి ఉన్న మడమకి ఐస్ ప్యాక్ను వాడడం
- సరిగ్గా సరిపోయే బూట్లు ధరించడం
- గట్టిగా ఉండే ఉపరితలాల పై చెప్పులు లేకుండా నడవడాన్ని నివారించడం
- కండరాల సాగతీత (muscle stretching) వ్యాయామాలను చేయడం
- అధిక బరువు ఉంటే బరువును తగ్గించడం
శస్త్రచికిత్స లేని విధానాలతో నొప్పికి ఉపశమనం కలగకపోతే, శస్త్రచికిత్స ఆఖరి మార్గం.