గుండె వ్యాధి లేదా గుండె జబ్బు అంటే ఏమిటి?
గుండె వ్యాధులు (లేదా హృదయ వ్యాధులు) అనేవి గుండె మరియు గుండె యొక్క రక్త నాళాలను దెబ్బతీసే అనేక పరిస్థితులను సూచిస్తాయి. నేడు, గుండె వ్యాధులు మరణానికి దారి తీసే అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి మరియు అరిథ్మియా , కరోనరీ ఆర్టరీ వ్యాధి మరియు పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి వంటి పరిస్థితులూ మరణ కారకాలుగా ఉన్నాయి. గుండె పోటు (heart attack) మరియు గుండె వైఫల్యం (heart failure) అనే గుండె జబ్బులు ప్రపంచమంతటా ఉన్న సాధారణ రకాలైన గుండె వ్యాధులలో రెండు.
గుండె వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అథెరోస్క్లెరోటిక్ (రక్త నాళాలు ఇరుకై, రక్తప్రసరణను అడ్డుకునే పరిస్థితి) వ్యాధికి సంబంధించిన లక్షణాలు:
- ఛాతీలో గట్టిదనం లేదా పట్టేసినట్లుండడం, నొప్పి (పురుషుల్లో ఇది సాధారణం) మరియు అసౌకర్యం (మహిళల్లో ఇది సాధారణం).
- శ్వాసలోపం.
- దవడ, మెడ, వెనుక మరియు దిగువ ఉదరం వరకు వెలువడే ఛాతీ నొప్పి
- చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి, నొప్పి మరియు బలహీనత
అరిథ్మియాలకు సంబంధించిన లక్షణాలు:
- హృదయంలో దడతో కూడిన గందరగోళకరమైన వేదన
- గుండె దడ తీవ్రమవడం మరియు మైకము.
- టాచీకార్డియా (వేగవంతమైన హృదయ స్పందన రేటు).
- బ్రాడికార్డియా (నెమ్మదిగా ఉండే గుండె స్పందన రేటు).
- ఊపిరాడకపొయే పరిస్థితి.
గుండె లోపాలు లేదా గుండె వైఫల్యాలకు సంబంధించిన లక్షణాలు:
- శిశువుల్లో పాలిపోయి, నీలి రంగులోనికి మారిన చర్మం రంగు.
- శిశువుకు ఆహారం తినిపించేటప్పుడు ఊపిరాడని పరిస్థితి ఉండడంవల్ల శిశువు బరువు తగ్గడం సంభవించొచ్చు, తద్వారా శిశువు ఆహారసేవనానికి విముఖత చూపుతూ ఉంటుంది.
- చేతులు, కాళ్ళు మరియు కడుపులో వాపు.
- వ్యాయామాలు లేదా కొద్దిపాటి శారీరక కార్యకలాపాలకే సులభంగా అలసిపోవచ్చు.
గుండె సంక్రమణకు సంబంధించిన లక్షణాలు కిందివిధంగా ఉంటాయి:
- రాత్రి చెమటలు మరియు చలి పట్టడం.
- దగ్గు.
- హార్ట్ మర్మెర్స్ (గుండె లయకు మధ్యలో వచ్చేశబ్దం) .
- ఛాతీ, పొత్తికడుపు, వేళ్లు మరియు కాలి వేళ్ళలో నొప్పి.
ప్రధాన కారణాలు ఏమిటి?
గుండె వ్యాధులకు కారణాలు వ్యాధి రకం ప్రకారం విభిన్నంగా ఉంటాయి మరియు కింది లక్షణాల్నికలిగి ఉండవచ్చు:
- ఎథెరోస్క్లెరోటిక్ గుండె జబ్బు: అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవన విధానం, అధిక బరువు మరియు ధూమపానం.
- అరిథ్మియాస్: పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు, మధుమేహం , అధిక రక్తపోటు, మత్తుపదార్థాల దుర్వినియోగం, ధూమపానం మరియు ఒత్తిడి.
- గుండె లోపాలు: గర్భిణి తల్లి ఆరోగ్య పరిస్థితులు లేదా జన్యు కారకాలవల్ల, కొన్ని మందులవల్ల గర్భమందున్నపుడే పిండం యొక్క గుండె అభివృద్ధిని దెబ్బ తీస్తాయి.
- గుండె సంక్రమణలు (హార్ట్ ఇన్ఫెక్షన్లు): బాక్టీరియా, వైరస్లు లేదా పరాన్నజీవులు రక్తము ద్వారా గుండెకు చేరుకుంటాయి, తద్వారా సంక్రమణను కలుగజేస్తాయి. రుమటిక్ హార్ట్ డిసీజ్, సిఫిలిస్, వాల్వ్ హృదయ వ్యాధులు మరియు గుండెకు చేసిన శస్త్రచికిత్సలు లేదా నోటి కుహరం యొక్క శస్త్రచికిత్సలు గుండెకు మరిన్ని అంటువ్యాధులు కలిగేందుకు కారణమవుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
గుండె వ్యాధులను నిర్ధారించడంలో అనేక పరిశోధనలతోబాటు రోగి వ్యాధి చరిత్ర మరియు శారీరక పరీక్ష తోడ్పడతాయి.
అట్టి పరిశోధనలు కిందివిధంగా ఉంటాయి.
- కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిల్ని అంచనా వేసేందుకు రక్త పరీక్ష.
- ఒత్తిడి పరీక్ష.
- ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) పరీక్ష
- ఎకోకార్డియోగ్రామ్ (2D ఎకో) పరీక్ష.
- టిల్ట్ పరీక్షలు.
- ఎలక్ట్రోఫిజియోలాజిక్ పరీక్షలు.
- కొరోనరీ ఆంజియోగ్రామ్ పరీక్ష.
- CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్.
గుండె వ్యాధులకు చేసే చికిత్సలో ఔషధాలతో పాటు జీవనశైలి మార్పులను అలవర్చుకునే విధంగా ఉంటుంది. ధూమపానం మరియు అధిక సారా-సంబంధ మత్తుపానీయాల్ని త్రాగటం మానుకోండి.
మీ వైద్యుడు తక్కువ కొవ్వులుండే ఆహారం తినమని మరియు కనీసం రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయమని లేదా కనీసం 30 నిమిషాలు నడక (వాహ్యాళి) చేయమని మీకు సలహా ఇస్తారు. అధిక రక్తపోటును తగ్గించేందుకు మరియు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మందులు అవసరమవుతాయి.
వ్యాధి రకం మరియు వ్యాధియొక్క వ్యాప్తి మేరను బట్టి మీ వైద్యుడు శస్త్రచికిత్సకు సలహా ఇస్తారు. హృదయ ధమనులలో అడ్డంకుల చికిత్సకుగాను ఒక మెటల్ స్టెంట్ (ఆంజియోప్లాస్టీ) లేదా కాలు లేదా ఛాతీ ప్రాంతం (అంటుకట్టుట) నుండి స్పష్టమైన రక్తనాళాన్ని అమర్చడం ద్వారా రక్త నాళాల (బైపాస్ శస్త్రచికిత్స) కోసం ఓ కొత్త మార్గాన్ని సృష్టించడం అవసరం కావచ్చు.