పక్కటెముక ఫ్రాక్చర్ అంటే ఏమిటి?
పక్కటెముక ఫ్రాక్చర్ అనేది ఛాతీ లోపల ఉండే పక్కటెముకలలో చీలిక లేదా పగులు ఏర్పడడం. ఒకటికంటే ఎక్కువ పక్కటెముకలు విరిగిపోయినప్పుడు, అది ఫ్లేయిల్ ఛాతీ (విరిగిన పక్కటెముకలోని భాగం మిగిలిన ఛాతీభాగం నుండి వేరైపోతుంది) కి దారితీస్తుంది. రొమ్ము ఎముకులతో కలిపి ఉండే పక్కటెముకల యొక్క కణజాలం లేదా కార్టిలేజ్ లో చీలికను (పగులును) కూడా పక్కటెముక ఫ్రాక్చర్ గానే సూచిస్తారు, (ఒకవేళ పక్కటెముక విరుగకపోయిన కూడా).
పక్కటెముకలు ఛాతీ లోపల ఉన్న ముఖ్యమైన అవయవాలను కాపాడతాయి. అవి ఊపిరితిత్తుల చుట్టూ కొంత స్థలం ఖాళీ ఉండేలా సహాయం చేస్తాయి, తద్వారా ఊపిరితిత్తులు సులభంగా గాలిని నింపుకోవచ్చు. పక్కటెముకను దెబ్బతీసేంత బలమైన దెబ్బ అంతర్గత అవయవాలకు హాని కలిగించవచ్చు. సాధారణంగా, పక్కటెముక విరిగినప్పుడు ఊపిరితిత్తుల కూడా హానికలగడం లేదా గాయం ఏర్పడడం (న్యూమోతోరాక్స్) జరుగుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రక్కటెముక ఫ్రాక్చర్ లక్షణాలు:
- ఎవరైనా రొమ్ము ఎముకను నొక్కినప్పుడు ఆ ప్రభావిత ప్రాంతం చుట్టూ నొప్పి
- నిరంతరమైన స్వల్ప లేదా తీవ్ర నొప్పి
- శ్వాస పీల్చుకునేటప్పుడు నొప్పి
- శ్వాస తీసుకోవడంలో కష్టం అది ఉపిరి ఆడకపోవడానికి, మైకము, తలనొప్పి, స్థిమితం లేకపోవడం మరియు ఆందోళన వంటి వాటికి దారితీస్తుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణంగా ఛాతీకి నేరుగా దెబ్బతగిలినప్పుడు అది పక్కటెముక విరిగిపోవడానికి (ఫ్రాక్చర్) కారణమవుతుంది. చాలా తీవ్రంగా (గట్టిగా) దగ్గడం లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ కూడా చాలా అరుదైన సందర్భాలలో పక్కటెముక ఫ్రాక్చర్లకు కారణం కావచ్చు. అయితే, పక్కటెముక పగులు యొక్క సాధారణ కారణాలు:
- ప్రమాదాలు లేదా ఆకస్మిక గాయం
- ఫుట్బాల్ మరియు హాకీ వంటి భారీ క్రీడలు
- బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరాసిస్ )
- కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR, cardiopulmonary resuscitation) సమయంలో గుండెను తిరిగి స్పందించేలా చెయ్యడానికి వైద్యులు పక్కటెముకల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టినపుడు కూడా ఫ్రాక్చర్ సంభవించవచ్చు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు లక్షణాలు మరియు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. వైద్యులు ఛాతీ మీద కమిలిన గాయాలు లేదా వాపును పరీక్షిస్తారు. ఎక్స్-రే ఫ్రాక్చర్ను నిర్ధారించడంలో సహాయం చేస్తుంది. అయితే, ఎక్స్-రేలు స్థానభంగం కానీ (non-displaced) ఫ్రాక్చర్లను పూర్తిగా నిర్దారించలేకపోవచ్చు. కాబట్టి, సిటి స్కాన్ కూడా అవసరం కావచ్చు.
నిర్ధారణ తర్వాత, పక్కటెముక ఫ్రాక్చర్లకు శస్త్రచికిత్స మరియు వెంటిలేటర్ సహాయం అవసరం. యాంటీ-ఇంఫ్లమ్మెటరీ మరియు నొప్పి నివారణ మందులు అసౌకర్యాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. ఒక పక్కటెముక ఫ్రాక్చర్ నయం కావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. రోగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఊపిరితిత్తులు పాక్షిక దెబ్బతినడం లేదా న్యుమోనియాను నివారించడానికి కనీసం గంటకు ఒకసారి ఘాడ శ్వాస తీసుకోవడం మంచిది. ఫ్రాక్చర్ నయం అయ్యే సమయంలో, క్రీడలను ఆడడం నుండి విరామం తీసుకోవాలి. అలాగే పక్కటెముకలు చుట్టూ ఏదైనా గట్టిగా చుట్టడాన్ని నివారించాలని కూడా సలహా ఇస్తారు.