డయాబెటిక్ నెఫ్రోపతీ అంటే ఏమిటి?
డయాబెటిక్ నెఫ్రోపతీ అనేది మూత్రపిండ వైఫల్యానికి కారణమయ్యే అత్యంత సాధారణ రుగ్మత. మూత్రపిండాల ప్రాథమికమైన పని రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తులను తొలగించడం. దీర్ఘకాలంలో మూత్రపిండాల యొక్క వడపోత వ్యవస్థలో డయాబెటిస్ వికారాల్ని (alterations) కలిగించవచ్చు, తద్వారా కణజాలాలకు నష్టం కలిగించి, మూత్రపిండ వ్యాధిని (నెఫ్రోపతీ) సంభవింపజేస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మూత్రపిండం పనితీరు దాదాపు పూర్తిగా కోల్పోయేంత వరకు కిడ్నీవ్యాధులు తమ లక్షణాలను (బయటికి కనబడేట్టు) ఉత్పత్తి చేయవు. అంతేకాకుండా, చివరకు కనిపించే వ్యాధి లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. ద్రవం పేరుకుపోవడం (ఫ్లూయిడ్ బిల్డ్-అప్) అనేది డయాబెటిక్ నెఫ్రోపతీ యొక్క మొదటి సంకేతం. ఇతర లక్షణాలు:
- నిద్ర కోల్పోవడం
- కడుపు తిప్పు
- ఆకలి లేకపోవడం
- బలహీనత
- రక్తపోటులో అసమతుల్యత
- మూత్రంలో ప్రోటీన్
- మనసు కేంద్రీకరించడంలో గందరగోళం లేదా కష్టం
- ఎడతెగని మొండి దురద
- పెరిగిన మూత్రవిసర్జన
- వికారం మరియు వాంతులు
డయాబెటిక్ నెఫ్రోపతీ యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?
రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తులను వడగట్టే కేశనాళికలు లేదా సూక్ష్మమైన వెంట్రుకలవంటి భాగాల్ని మూత్రపిండాలు (కిడ్నీలు) కలిగి ఉంటాయి. ఈ కేశనాళికలలోని చిన్న చిన్న రంధ్రాలు వదగట్టే సాధనాల్లా (ఫిల్టర్లు) పనిజేస్తాయి. ఈ ఫిల్టర్ల ద్వారా, వ్యర్థ ఉత్పత్తులను మూత్రం రూపంలో విసర్జించబడతాయి. రక్తపు కణాలు మరియు ప్రోటీన్ లు ఈ రంధ్రాల కన్నా పెద్దవి, అందువలన మూత్రంలోకి రావు.
రక్తంలో పెరిగిన చక్కెర స్థాయి మూత్రపిండంలోని ఈ కేశనాళికలవంటి సూక్ష్మ రంధ్రాలకు నష్టం కలిగించి ఆ రంధ్రాలను పెద్దవిగా చేస్తుంది. ఫలితంగా, రక్తం కూడా ఆ రంధ్రాల గుండా విసర్జనకు గురై బయటికి వెళుతుంది. ఇది మూత్రపిండాల వడపోతభాగమైన గ్లోమెరులీ (glomeruli) కి నష్టం కలిగిస్తుంది. కాలక్రమాన, గ్లోమెరులీ అనబడే ఈ ఫిల్టర్లకి పెద్ద పెద్ద రంధ్రాలేర్పడి కారడం ప్రారంభమవుతాయి మరియు చిన్న మొత్తంలో అవసరమైన ప్రోటీన్లు మూత్రం (మైక్రోఅల్బ్యూమినూరియా) ద్వారా విసర్జించబడుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ పరిస్థితి మైక్రోఅల్బమిన్ క్షీణత పెరుగుదలకు కారణమవుతుంది, అట్లే కొనసాగి చివరి స్థాయి మూత్రపిండ వ్యాధి (ఎండ్-స్టేజ్ -మూత్రపిండ వ్యాధి -ESRD) గా మారి పోతుంది. .
తరువాత, మూత్రపిండాల్లో ఈ ఒత్తిడి వడపోత సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. తర్వాత, వ్యర్థ ఉత్పత్తులు రక్తంలోపేరుకుపోతాయి. చివరకు, మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుంది.
డయాబెటిక్ నెఫ్రోపతీని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు మీకు శారీరక పరీక్షను నిర్వహిస్తాడు మరియు మీ వైద్య చరిత్రను తీసుకుంటాడు. అప్పుడు మీకు కింద పేర్కొన్న కొన్ని పరీక్షలు చేయించామని సలహా ఇవ్వవచ్చు:
- మూత్రపిండాల పరిస్థితి తనిఖీకి మరియు దాని పనితీరు అంచనాకు రక్త పరీక్షలు
- మూత్రంలో ప్రోటీన్ విషయాన్ని తనిఖీ చేయడానికి మూత్ర పరీక్షలు. మూత్రంలో సూక్ష్మకణువు (microalbumin) అని పిలువబడే ప్రోటీన్ యొక్క అధిక స్థాయి నెఫ్రోపతీ యొక్క ప్రారంభ దశని సూచిస్తుంది
- X-రే లు, MRI మరియు CT స్కాన్ లు మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తనిఖీ చేసేందుకు
- వడపోత సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి మూత్రపిండపు పనితీరు పరీక్ష
- మూత్రపిండ జీవాణు పరీక్ష (కిడ్నీ బయాప్సీ)
నెఫ్రోపతీ ప్రారంభ దశల్లో మందులు వాడతారు:
- అధిక రక్తపోటును నియంత్రించడానికి
- అధిక రక్త చక్కెర స్థాయిని నిర్వహించడానికి
- రక్త కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి
- మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు నియంత్రించడానికి
తరువాతి దశలలో, మూత్రపిండ మార్పిడి మరియు డయాలసిస్ చేయించుకొమ్మని సలహా ఇవ్వబడుతుంది.