ఛాతీ సంక్రమణలు లేదా అంటువ్యాధులు అంటే ఏమిటి?
ఛాతీ యొక్క సంక్రమణలు లేదా అంటువ్యాధులు సాధారణంగా క్రింది శ్వాసకోశ భాగాలైన ఊపిరితిత్తులను మరియు శ్వాసనాళికల సంక్రమణలను కలిగి ఉంటాయి. ఈ అంటువ్యాధులు ప్రధానంగా రొమ్ముపడిసెం (శ్వాసనాళాల వాపు), ఊపిరితిత్తులలోని పెద్ద వాయుమార్గాల యొక్క వాపు, మరియు ఊపిరితిత్తులలోని వాయు తిత్తుల (air sacs) యొక్క వాపు అయిన న్యుమోనియా. అన్ని ఛాతీ సంక్రమణలు లేదా అంటువ్యాధులు ప్రధానంగా నిరంతర దగ్గు, జలుబు మరియు జ్వరం వంటి లక్షణాలను చూపిస్తాయి. ఛాతీ సంక్రమణలు లేదా అంటువ్యాధులు 2030 నాటికి, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులలో అత్యంత సాధారణ రకంగా అంచనా వేయబడ్డాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఛాతీ సంక్రమణల యొక్క అత్యంత సాధారణ లక్షణం నిరంతర దగ్గు అయినప్పటికీ, కొన్ని ఇతర సంకేతాలు మరియు లక్షణాలు కూడా చూడవచ్చు:
- నిరంతర తడి దగ్గు
- ఆకుపచ్చ లేదా పసుపు రంగు శ్లేష్మం (కఫం)
- ఊపిరి అందకపోవడం
- జ్వరం
- దగ్గుతున్నపుడు ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం
- అలసట
- కండరాల నొప్పి
దగ్గు మరియు ఊపిరి ఆడకపోవడం అనేవి ఉబ్బసంలా గందరగోళానికి గురిచేస్తాయి. ఛాతీ ఇన్ఫెక్షన్లు ఉబ్బసం లక్షణాలు ఇంకా తీవ్రతరం చేయవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఛాతీ సంక్రమణలు అనేక కారణాల వలన కలుగవచ్చు. చిన్న పిల్లలు, ధూమపానం చేసేవారు మరియు గర్భిణీ స్త్రీలలో ఛాతీ సంక్రమణ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్వయం ప్రతిరక్షక రుగ్మతలు (autoimmune disorders) మరియు మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి (interstitial lung disease) వంటి కొన్ని సమస్యలు కూడా పునరావృత ఛాతీ సంక్రమణలకు దారి తీయవచ్చు. ఛాతీ సంక్రమణం యొక్క సాధారణ కారణాలను పరిశీలిద్దాము.
- నిరంతర జలుబు మరియు ఫ్లూ: ఇవి ఉపిరితిత్తుల వాయుమార్గాల్లో వాపు మరియు సంక్రమణకు దారితీయవచ్చు.
- కలుషిత గాలి మరియు ధూళికి తరచుగా బహిర్గతం కావడం: ఏ రకమైన కాలుష్య కారకాలు అయినా ఉపిరితిత్తుల వాయుమార్గాల యొక్క గోడలను చికాకు పెట్టగలవు.
- సూక్ష్మజీవుల వలన సంక్రమణ: రొమ్ముపడిసెం (Bronchitis) సాధారణంగా రినోవైరస్ లేదా ఇన్ఫ్లుఎంజా వైరస్ వంటి వైరస్లు మరియు కొన్ని అరుదైన సందర్భాల్లో బాక్టీరియా ద్వారా సంభవిస్తుంది. న్యుమోనియా సాధారణంగా బాక్టీరియా సంక్రమణ వలన సంభవిస్తుంది; అయితే, వైరస్లు, మైకోప్లాస్మా మరియు శిలీంధ్రాలు (ఫంగస్) కూడా న్యుమోనియాకు కారణమవుతాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
స్టెతస్కోప్ ఉపయోగించి ఛాతీ పరీక్ష చెయ్యడం అనేది ఛాతీ సంక్రమణల నిర్ధారణకు సహాయపడుతుంది. ఛాతీ పరీక్ష తరువాత ఈ పరీక్షలు చెయ్యడం ద్వారా, చికిత్సా విధానాన్ని అంచనా వెయ్యవచ్చు:
- ఛాతీ యొక్క ఎక్స్-రే
- కఫం యొక్క పరిశీలన
- స్పైరోమీటర్ (spirometer) ఉపయోగించి పల్మనరీ ఫంక్షన్ పరీక్షలు (Pulmonary function tests)
- పల్స్ ఆక్సిమెట్రి (Pulse oximetry, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తనిఖీ చేయడానికి)
రొమ్ముపడిసెం (Bronchitis) తీవ్రంగా లేదా కొన్నిసార్లు దీర్ఘకాలికంగా ఉండవచ్చు. రొమ్ముపడిసెం (Bronchitis) సాధారణంగా ఈ క్రింది వాటిని ఉపయోగించి చికిత్స చేస్తారు:
- నెబ్యులైజర్లను (nebulisers) ఉపయోగించి స్టెరాయిడ్లను పీల్చడం
- నోటి ద్వారా తీసుకొనే స్టెరాయిడ్స్
- నోటి ద్వారా తీసుకొనే ఇంటర్ల్యూకిన్ ఇన్హిబిటర్లు (interleukin inhibitors)
- బ్రాంకోడైలేటర్లు
న్యుమోనియాతో బాధపడుతున్న రోగులకు యాంటీబయాటిక్స్ను అధిక మోతాదులో ఇవ్వడం జరుగుతుంది, ఇవి బాక్టీరియాపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. వైద్యులు న్యుమోనియా వలన వచ్చిన జ్వరం కోసం యాంటిపైరెటిక్స్ (జ్వరం-తగ్గించే మందులు) మరియు మాక్రోలిడ్ (macrolide) లేదా బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ను సూచింస్తారు. అదనంగా, రెండు రకాలైన ఛాతీ సంక్రమణల కోసం, ఈ క్రింది స్వీయ రక్షణ చర్యలు సూచించబడతాయి:
- నీటి పుష్కలంగా త్రాగాలి
- విశ్రాంతి తీసుకోవాలి
- ధూమపానం మానుకోవాలి
- నాసల్ డెకోంగ్స్టాంట్స్ను (nasal decongestants) ఉపయోగించడం
- కొన్ని సందర్భాల్లో లక్షణాలు తీవ్రమై ఆక్సిజెన్ సహాయం అవసరం అయ్యినప్పటికీ, ఛాతీ సంక్రమణలు లేదా అంటువ్యాధులు సాధారణంగా ప్రారంభలో గుర్తించడం మరియు సకాల చికిత్సతో సులభంగానే నియంత్రించబడతాయి.