లెప్టోస్పైరోసిస్ అంటే ఏమిటి?
లెప్టోస్పైరోసిస్ అనేది లెప్టోస్పైరా అని పిలవబడే ఒక మెలికల-ఆకారపు (spiral-shaped) బ్యాక్టీరియా (స్పైరోకిట్ [spirochete]) వలన సంభవిస్తుంది. ఈ సంక్రమణ విస్తృతమైన లక్షణాలను ఉత్పత్తి చేయగలదు, వాటిలో చాలా లక్షణములు ఇతర అంటువ్యాధులని/సంక్రమణలని పోలి ఉంటాయి. అందువలన, ఒక ఖచ్చితమైన నిర్ధారణకు మూత్రం లేదా రక్త నమూనాలను పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాధితో పాటు మూత్రపిండాల హాని/నష్టం, శ్వాసకోశ వ్యాధులు, కాలేయ వైఫల్యం మరియు మెనింజైటిస్ (మెనిన్గేస్ [meninges] అని పిలవబడే మెదడు చుట్టూ ఉండే రక్షిత పొరల యొక్క వాపు) వంటి ఇతర సమస్యలు ముడిపడి ఉంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లెప్టోస్పైరోసిస్ ఈ క్రింది లక్షణాలను కలిగిస్తుంది:
- జ్వరం
- చలి
- తలనొప్పి
- వాంతులు
- కామెర్లు
- కళ్ళు ఎర్రగా మారడం
- కండరాల నొప్పి
- దద్దుర్లు
- మెడ గట్టిగా మారడం (బిగుసుకు పోవడం)
- ప్లీహము విస్తరించడం (enlarged spleen)
- అతిసారం
బ్యాక్టీరియాకు గురికావడానికి మరియు అనారోగ్య లక్షణాలు కనిపించడానికి మధ్య సమయం రెండు రోజుల నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది, ఈ పరిస్థితి యొక్క మొదటి లక్షణం జ్వరం రావడం. లెప్టోస్పైరోసిస్ రెండు ముఖ్య దశలను కలిగి ఉంటుంది, అవి:
- దశ 1: జ్వరం, తలనొప్పి, వాంతులు మరియు కండరాల నొప్పి.
- దశ 2: మూత్రపిండాల లేదా కాలేయ నష్టం/దెబ్బతినడం, ఐరిస్ (కంటి నల్లగుడ్డు) యొక్క వాపు లేదా మెనింజైటిస్తో పాటుగా నాడుల/నరాల రుగ్మత సంభవించడం.
లెప్టోస్పైరోసిస్ గర్భిణీ స్త్రీలలో ప్రాణాంతకంగా మారవచ్చు మరియు గర్భస్రావానికి కూడా కారణం కావచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వ్యాధి సోకిన జంతువుల యొక్క మూత్రముతో సంభందం కలిగి ఉండడం (పొరపాటున తాకడం లేదా స్పర్శించడం వలన) సంక్రమణ సంభవిస్తుంది. కుక్కలు, పశువులు, గుర్రాలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల మూత్రంలో ఈ బాక్టీరియాను గమనించవచ్చు. లెప్టోస్పైరా ఎలుకలలో కూడా గమనింపబడుతుంది. వ్యాధి సంక్రమిత మూత్రం లేదా దానితో కలుషితమైన ఆహారం లేదా నీటితో ప్రత్యక్ష సంబంధం ఏదైనా ఈ సంక్రమణకు కారణమవుతుంది. బ్యాక్టీరియా కళ్ళు లేదా ముక్కు వంటి శ్లేష్మ ఉపరితలాల (mucosal surfaces) నుండి లేదా చర్మం మీద చీలిక (దెబ్బ) ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మానవ వాహకాల (carriers) ద్వారా చాలా అరుదుగా వ్యాపిస్తుంది; అందువల్ల, ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించినట్లు ఎక్కువగా తెలియలేదు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాల యొక్క ప్రారంభ దశలలో శరీర ద్రవాల నుండి బాక్టీరియాను సేకరించి సాగు చేయటం ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (మెదడు మరియు వెన్ను పూస చుట్టూ ఉండే ఒక ద్రవం)ను సాధారణంగా లక్షణాల ప్రారంభ దశలలో పరీక్షిస్తారు, అయితే తరువాతి దశలలో మూత్ర పరీక్ష (సాగు) చేస్తారు. అదే విధంగా, రోగ నిర్ధారణను ధృవీకరించడానికి రక్త మరియు రోగనిరోధక వ్యవస్థ కణాల పరీక్షలు జరుపవచ్చు.
పెన్సిలిన్ (penicillin), డోక్సీసైక్లిన్ (doxycycline), స్ట్రెప్టోమైసిన్ (streptomycin) మరియు ఎరిత్రోమైసిన్ (erythromycin) వంటి యాంటిబయోటిక్స్ ఈ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. శ్వాసలో సమస్యలు ఉన్నపుడు, మెకానికల్ (యాంత్రిక) వెంటిలేషన్ మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయం మరియు మూత్రపిండాల వైఫల్యానికి చికిత్స చేయడానికి యాంటీబయాటిక్స్తో పాటుగా పెరిటోనియల్ డయాలిసిస్ను (Peritoneal dialysis) ఉపయోగిస్తారు.
నివారణ:
- వ్యాధి సోకిన జంతువులకు దూరంగా ఉండాలి.
- పెంపుడు జంతువులను శుభ్రపరిచేటప్పుడు రక్షిత దుస్తులను ధరించాలి (protective clothing).
- సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడం కోసం జంతువుల మూత్రంతో కలుషితమైన నీటి వినియోగించటం లేదా ఆ నీటిలో ఈత కొట్టడం వంటివి నివారించాలి.